Donald Trump : అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. త్వరలో ఇరాన్–అమెరికా మధ్య మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ట్రంప్ ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.
‘‘ఇరాన్‌తో ఒక మంచి డీల్ కుదుర్చకునేందుకు దగ్గరగా ఉన్నాం. కానీ, ఒకవేళ చర్చలు విఫలమైతే సైనిక చర్య అనే మార్గం ఇంకా తెరిచే ఉంది. మేం మళ్లీ తిరిగి వెళ్లి ఇరాన్‌ను అంతం చేస్తాం. ఇరాన్‌తో కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా సరే.. అణ్వాయుధ దేశంగా ఉండటానికి మాత్రం అంగీకరించం. మేం కావాలనే వారి సైన్యాన్ని ఓడించాం. నేను ఒప్పందానికే ఇష్టపడతా. ఎందుకంటే సంతకం అయిన వెంటనే హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవవచ్చు. కానీ, ఆ దేశానికి అణ్వాయుధాలు ఉండవు అనే విషయంలో నేను హామీ ఇవ్వగలను.
దీనికి వాళ్లు అంగీకరించారు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక చర్యల ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటే ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్నారు. హార్ముజ్ జలసంధి తెరవడం, సముద్ర మార్గంలో భద్రత వంటి అంశాలపై ఇరాన్–అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఇరాన్‌తో చర్చలకు తొందరేమీ లేదని ఇటీవల ట్రంప్ వెల్లడించారు. చర్చలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. శాంతి చర్చలు విఫలమైతే సైనిక చర్యకు అవకాశం ఉందన్నారు.