హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సోమవారం ఫార్మసీ, ఈ-ఔషధీ వర్షాప్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ జిల్లాలోనూ సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్‌తోపాటు మందుల సరఫరాకు వాహనాలను సమకూర్చామని తెలిపారు. ఎకడైనా పేషెంట్ ఇబ్బంది పడినట్టు తమ దృష్టికి వస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఔషధ నిల్వల పరిశీలనకు ప్రతి జిల్లాలోనూ కమిటీని వేస్తున్నామని తెలిపారు. సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలు రోజూ పొద్దున్నే హాస్పిటల్‌లోని ఫార్మసీ స్టోర్‌ను తనిఖీ చేయాలని ఆదేశించారు.
హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదు!
హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కొత్తదేమీ కాదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, నాటి నుంచే ప్రపంచంలో పలుచోట్ల వ్యాప్తిలో ఉన్నదని పేర్కొన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందని తెలిపారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తిని సమీక్షిస్తున్నామని, రాష్ట్ర అధికారులు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా నిరాధార, తప్పుడు సమాచారన్ని ప్రచారం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్నిరకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదురొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు.