హుజూరాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తెలంగాణ దళితబంధు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. ఆదివారం ఇల్లందకుంట మండలం చిన్న కోమటిపల్లి గ్రామంలో ఆయన దళితులతో సమావేశం నిర్వహించారు.
సింహగర్జన అయినా, సంక్షేమ కార్యక్రమమైనా అది కరీంనగర్ నుంచే మొదలవుతుందని, అందుకే దళితబంధు అమలుకోసం పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారని రవిశంకర్ తెలిపారు. మూడేండ్లలో దళితల్లో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరాలన్నదే సీఎం ఆలోచన అని ఎమ్మెల్యే అన్నారు. ఇది ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన పథకం కానేకాదని దళితులను బాగు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన పథకంగా ఆయన పేర్కొన్నారు.
దళితులు బాగుపడడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని అందుకే దళితబంధుపై లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడ లేని విధంగా దళితబంధు పథకం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం తరుఫున ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. గతంలో దళితులను ను ఓట్లు వేసే యంత్రాలుగా పరిగణించే వారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు.
ఈ పథకం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రైతుబంధు లాగే నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే జమ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. దళితబంధు కోసం సర్వే పూర్తి అయ్యిందని, విడతల వారిగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఒకరి క్రింద పని చేస్తున్న దళిత యువకులు యజమానులుగా మారడానికి దళిత బంధు పథకం పని చేస్తుందని రవిశంకర్ తెలిపారు.