తుర్కపల్లి, జనవరి 26: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితబంధు పథకం విజయవంతంగా అమలవుతున్నదని సీఎంవో అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ అన్నారు. బుధవారం వారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, స్త్రీ, శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ డాక్టర్ ఏ శరత్, ఎస్సీ సంక్షేమ శాఖ సీఎంవో కార్యదర్శి రాహుల్‌బొజ్జా, కలెక్టర్ పమేలాసత్పతి, అదనపు కలెక్టర్ దీపక్‌తివారీతో కలిసి వాసాలమర్రిని సందర్శించారు.
తొలుత గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం అందుతున్నదా? లేదా అని ఆరా తీశారు. పిల్లల ఎత్తు, బరువును పరిశీలించారు. ఆ తరువాత రామాలయం సమీపంలోని దళితవాడలో కలియ తిరిగారు. దళితబంధు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి యూనిట్లను పరిశీలించారు. బొల్లారం సుశీల, బొల్లారం లావణ్య, గ్యార ఆండాలు, బొల్లారం రాములు తదితరులతో మాట్లాడి ఆదాయ, వ్యయాల గురించి వివరాలను అడిగి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘దళితబంధు’ లబ్ధిదారులైన 76 దళిత కుటుంబాలకుగాను 57కుటుంబాలకు గ్రౌండింగ్ చేశామని, మిగతా వారికి త్వరలో గ్రౌండింగ్ చేస్తామని చెప్పారు. ఎర్రవెల్లి తరహాలో వాసాలమర్రి అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు.
లబ్ధిదారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: గొంగిడి సునీత
తాము ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం దళితబంధు లబ్ధిదారుల్లో కనిపిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వాసాలమర్రిలో పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని, లబ్ధిదారులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. లబ్ధిదారుల మాటలు వింటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతున్నదని అన్నారు.