హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ పంటలతోపాటు పాడి, పౌల్ట్రీ రంగాలు భారీ ఉత్పత్తిని నమోదు చేశాయి. మటన్, చికెన్ సైతం గణనీయమైన ఉత్పత్తిని రికార్డు చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ విశేష ప్రగతిని సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ వ్యవసాయం, వ్యవసాయాధార రంగాలకు పెద్దపీట వేయడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆవులు, బర్రెల కొనుగోలు భారీ ఎత్తున సబ్సిడీలు ఇచ్చి పాడి రైతులను ప్రోత్సహించింది. గొల్ల-కురుమల సంక్షేమానికి గొర్రెలు, మేకలను పంపిణీ చేసింది. ప్రజల ఉపాధి కోసం పెద్ద ఎత్తున కోళ్ల పెంపకందారులకు భారీగా సబ్సిడీలు అందజేసింది. దీంతో రాష్ట్రంలో అనేకమందికి పాడి, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం ప్రధాన వృత్తిగా మారింది. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ క్రమంగా ప్రగతిని సాధించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో కేవలం 3,924.14 లీటర్ల పాల ఉత్పత్తి ఉండేది. పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో అది 2024 నాటికి 5,839.56 లీటర్లకు పెరిగింది.
తగ్గిన మాంసం దిగుమతులు
పశు సంపద వృద్ధి చెందడంతో చర్మకార పరిశ్రమకు ముడి సరుకు లభిస్తున్నది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకం పాలు, మాంసాహార అవసరాలను తీర్చిలా వృద్ధిచెందింది. వ్యవసాయంతోపాటు రైతాంగానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్నది. ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా పశు సంపదను పంపిణీ చేసింది. దీంతో ఆయా వృత్తికులాల ఆదాయం పెరిగింది. ఉత్పత్తి భారీగా నమోదవుతున్నది. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి పెరగడంతో దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. గొల్ల కురుమలకు గొర్రెలు, మేకల యూనిట్ల పపిణీతోపాటు ముదిరాజ్, బెస్తలకు చెరువుల్లో చేపల పెంపకాన్ని కేసీఆర్ సర్కార్ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. సామాజిక వర్గాల వారీగా బర్రెలు, ఆవులను పంపిణీ చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ఆయా వర్గాల్లో ఉపాధి రంగం మెరుగుపడిందని తాజా సామాజిక, ఆర్థిక గణాంకాలు వెల్లడించాయి.