న్యూఢిల్లీ, జనవరి 6: అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ప్రతి రోజు 6000 నుంచి 9000 అడుగులు నడిస్త్తే గుండె సంబంధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుందని అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా సహా 42 దేశాల ప్రజలపై అధ్యయనం జరిపిన తర్వాత ఈ వివరాలను సర్కులేషన్ అనే జర్నల్లో ప్రచురించారు. మహిళలపైనా ఈ అధ్యయనం జరిగింది. రోజుకు 2000 అడుగులు వేసే వారి కంటే రోజుకు 6000 నుంచి 9000 అడుగులు నడిచే వారిలో గుండెపోటు వచ్చే ముప్పు దాదాపుగా 40 నుంచి 50 శాతం తక్కువగా ఉందని గుర్తించినట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డా.అమంద పలుచ్ పేర్కొన్నారు. ఇలా నడవడం పెద్ద కష్టమేమీ కాదని తెలిపారు.