e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News రికార్డు రైడ్‌

రికార్డు రైడ్‌

  • బృందంలో ఇద్దరు మహిళలు.. 61 ఏండ్ల నవ యువకుడు
  • 13 రాష్ర్టాల మీదుగా.. 23 రోజుల్లో గమ్యం చేరిన సభ్యులు
  • ఎలాంటి ఆటంకాలు లేకుండా 3700 కిలోమీటర్లు సాగిన కే2కే సాహసయాత్ర

అసలే చలికాలం.. ఈ సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీకి పోతే వణికిపోతాం. ఇక కశ్మీర్‌ సంగతి చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీల్లో ఉంటాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ సైక్లిస్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో 13 మంది సభ్యులు నవంబర్‌ 12న శ్రీనగర్‌ నుంచి సాహస యాత్ర మొదలుపెట్టారు. 18 ఏండ్లు మొదలు కొని 61 ఏండ్ల వయసు వారు 23 రోజుల్లో కన్యాకుమారి చేరి గమ్యాన్ని ముద్దాడారు. 13 మంది గ్రూప్‌సభ్యులతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ రైడ్‌ చేయడం దేశంలో మొట్టమొదటి సారని.. ఇది దేశ చరిత్రలో నిలిచిపోనున్నదని బృంద సభ్యులు పేర్కొన్నారు.

నవంబర్‌ 12న యాత్ర ప్రారంభం..

ఈ ఏడాది నవంబర్‌ 12న కశ్మీర్‌ (శ్రీనగర్‌) నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభమైంది. మైనస్‌ వన్‌ డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలోనూ ఎంతో ధైర్యసాహసాలతో వారు యాత్రను ప్రారంభించారు. మూడు రోజుల ముందే కశ్మీర్‌కు చేరుకొని కఠోర వ్యాయామం చేసిన అనంతరం రైడ్‌ను ప్రారంభించారు. ఈ బృందానికి భారత సైన్యం ఆశ్రయం కల్పించింది. కఠినమైన వాతావరణంలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత గ్వాలియర్‌ చేరగా తెలుగు అసోసియేషన్‌ ఈ బృందానికి ఘన స్వాగతం పలికింది.

ఐదు గంటలకే మేల్కొని..

- Advertisement -

ఈ బృంద సభ్యులు ప్రతిరోజు ఐదు గంటలకే నిద్ర లేచి ఆరు గంటల వరకు రైడ్‌ను మొదలు పెట్టి గంటకు సుమారు 20 నుంచి 25 కిలో మీటర్లు ప్రయాణించేవారు. మధ్యాహ్నం 1 గంటకు లంచ్‌.. రాత్రి 8 నుంచి 10 గంటలలోపు డిన్నర్‌ పూర్తి చేసి నిద్రపోయేవారు. ఇలా 23 రోజులు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్రను కొనసాగించారు.

పన్ను విరిగినా.. పట్టుసడలని రైడర్‌ లక్ష్మి

ఈ యాత్రలో 37 ఏండ్ల మహిళా రైడర్‌ లక్ష్మి జమ్మూలోని ఓ టోల్‌ప్లాజా వద్ద కిందపడిపోగా పన్ను విరిగింది. అయితే మూడు రోజుల్లోనే కోలుకొని మళ్లీ కే2కే రైడ్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరో ఘటనలో కమాండర్‌ కార్తికేయన్‌ పెడల్‌ స్లిప్‌ కావడంతో కిందపడిపోగా గాయాలయ్యాయి. అయినా వాటిని లెక్క చేయకుండా యాత్రను కొనసాగించారు.

యాత్ర సాగిందిలా..

శ్రీనగర్‌లో ప్రారంభమైన యాత్ర రంబాన్‌, పఠాన్‌కోట్‌, జలంధర్‌, అంబాల, ఢిల్లీ, మధుర, గ్వాలియర్‌, ఝాన్సీ, సాగర్‌, లకండౌన్‌, నాగ్‌పూర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, కర్నూల్‌, అనంతపూర్‌, బెంగళూర్‌, ధరమ్‌పురి, కరూర్‌, మధురై మీదుగా కన్యాకుమారి చేరింది.

ఏఐజీ వైద్యశాల ఆధ్వర్యంలో శిక్షణ..

రైడ్‌కు ముందు ఏఐజీ వైద్యశాల ఆధ్వర్యంలో బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. టెక్నీషియన్‌ మర్రి రాకేశ్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ ప్రసాద్‌ టేకుమల్ల, డ్రైవర్లు సందీప్‌, సుగున్‌, రైడర్‌ మేనేజర్‌ అంకూర్‌ రావత్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఎంఎల్‌ఆర్‌ఐటీ విద్యార్థి రమణారెడ్డి, జిమ్‌ ట్రైనర్‌ వంశీ (కోర్‌ స్ట్రెంత్‌), యోగా శిక్షకుడు శ్రీరాం ఎంతో ప్రోత్సహించారని వివరించారు.

సైక్లింగ్‌ క్యాపిటల్‌గా చూడాలన్నదే లక్ష్యం..

హైదరాబాద్‌ను సైక్లింగ్‌ క్యాపిటల్‌గా చూడాలన్నదే నా లక్ష్యం. మా యాత్రకు సంబంధించిన అన్ని అంశాలు, రూట్‌ మ్యాప్‌, వాతావరణ పరిస్థితులతో సహా బ్లూప్రింట్‌ను రూపొందిస్తాం. హైదరాబాద్‌ సైక్లిస్ట్‌ గ్రూప్‌ ఫౌండర్‌గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా హెచ్‌సీజీని తీర్చిదిద్దాలన్నదే నా తపన. ఇక ప్రతిఏటా కే2కే రైడ్‌ను నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ఎంతో సహకరించారు.- రవీందర్‌ నందనూరి, హెచ్‌సీజీ ఫౌండర్‌

రైడ్‌కు వెళ్తానని అనుకోలేదు

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ రైడ్‌కు వెళ్తానని కలలో కూడా ఊహించలేదు. నా తల్లి, స్నేహితురాలి ప్రోత్సాహం మరువలేను. హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ రవీందర్‌ సర్‌కు ధన్యవాదాలు. జీవితంలో ఇది గొప్ప మైలురాయిగా భావిస్తున్నా. ఈ సాహసయాత్రలో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చింది. -పూరి చౌహాన్‌, అమెజాన్‌ ఉద్యోగి

ఎంతో ఇష్టంగా..

పర్వతారోహణతో పాటు సైకిల్‌ రైడింగ్‌ అంటే ఎంతో ఇష్టం. రైడింగ్‌పై మమకారం చంపుకోలేకే యాత్రకు కదిలా. 2016లో ఎవరెస్ట్‌, 2019లో మకాలూ పర్వతాలను ఎక్కేశా. ఇప్పుడు సైకిల్‌ రైడ్‌లో బృందంతో పాటు విజయవంతంగా కే2కేను పూర్తి చేశా. – అంకుర్‌ రావత్‌

కొత్త అనుభూతి..

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అందాలను తిలకించడం సైకిల్‌ రైడ్‌తోనే సాధ్యం. ఇది చాలా గొప్పగా భావిస్తున్నా. ఇంతకు ముందు అనేక సైకిల్‌ రైడింగ్‌ల్లో పాల్గొన్నా. కే2కేలో పాల్గొనడం మాత్రం కొత్త అనుభూతినిచ్చింది. – శ్రీనివాస రామరాజు

ఆశయం నెరవేరింది..

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌ రైడ్‌ చేయాలన్న ఆశయం నెరవేరింది. ఒకే ఏడాదిలో 10,700 కిలోమీటర్లు సైకిల్‌ రైడ్‌ చేశా. ఎలాంటి ఆటంకాలు లేకుండా కే2కేలో పాల్గొని లక్ష్యాన్ని చేరుకున్నా. ఈ యాత్రలో 38 గంటల్లో 600 కిలోమీటర్ల రైడ్‌ చేశా. – సాయిరాం, ఎన్‌సీసీ క్యాడెట్‌

7 నుంచి 10 కిలోమీటర్లు పరుగెడుతా..

61 ఏండ్లు ఉన్నా చెదరని ఆత్మవిశ్వాసంతో సైకిల్‌ రైడ్‌లో పాల్గొన్నా. ఆరోగ్యంతో పాటు, కాలుష్య నివారణకు సైక్లింగ్‌ ఎంతో ఉపయుక్తం. ఎన్నో ప్రతికూలతలు ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగా. రోజూ వ్యాయామం చేస్తే ఎవరైనా సైకిల్‌ రైడింగ్‌ చేయవచ్చు. పశు సంవర్ధక శాఖలో ఉప సంచాలకుడిగా ఉద్యోగ విరమణ చేసిన నేను మాత్రం ప్రతిరోజు 7 నుంచి 10 కిలోమీటర్లు పరిగెడుతా. -యలమంచిలి శ్రీనివాస్‌రావు

ఎంతో తృప్తినిచ్చింది

హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు సైకిల్‌ సవారీ చేయడం గొప్ప తృప్తినిచ్చింది. దేశవ్యాప్తంగా ఎన్నో మైదానాలు, ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లు కొత్త అనుభవాలను పంచాయి. విభిన్న ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించాం. జమ్మూలో కిందపడిపోయి పన్ను విరిగింది. ఇక రైడ్‌ చేయలేమోనని అనుకున్నా. చికిత్స అనంతరం ఆత్మవిశ్వాసంతో మూడు రోజుల్లో తిరిగి రైడ్‌ మొదలుపెట్టా . 23 రోజుల్లో గమ్యం చేరాం. – లక్ష్మి శ్రీ, సైకిల్‌ రైడర్‌

కచ్చితమైన మార్గంలో ప్రయాణించాం

కచ్చితమైన మార్గంలో ప్రయాణించాం కాబట్టే ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న విధంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విజయవంతంగా రైడ్‌ ముగిసింది. మ్యాప్‌ల ద్వారా సమయాన్ని అంచనావేస్తూ.. ఎక్కడ బసచేయాలి, ఎటువంటి ఆహార పదార్థాలను సమకూర్చుకోవాలో ముందుగానే అంచనా వేశాం. కుటుంబాలతో కమ్యూనికేట్‌ చేయడం.. వారి ప్రోత్సాహం వల్ల మరింత ఉత్సాహంగా రైడ్‌ చేయగలిగాం. – ప్రసాద్‌ టేకుమల్ల

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement