Cyber Crime | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కేవైసీ పేరుతో మళ్లీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ వృద్ధుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.11 కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకు ఖా తాలను అప్డేట్ చేసుకునేందుకు కేవైసీ పూర్తి చేయాలంటూ కేటుగాళ్లు వాట్సప్ ద్వారా లింకులు పంపుతున్నారని, వాటిని క్లిక్ చేసిన వెంటనే ఆయా ఖాతాదారుల వివరాలు, ఫొటోలు, ఐడీలు, ఓటీపీలు సేకరించడం ద్వారా బ్యాంకు ఖాతాలను క్లోనింగ్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇలాంటి కేటుగాళ్ల చేతిలో వృద్ధులు ఎక్కువగా మోసపోతున్నట్టు తెలుస్తున్నది.
కేవైసీ అనేది బ్యాంకులు, ఇతర సంస్థలు తమ కస్టమర్ల గుర్తింపును ధ్రువీకరించుకునే ప్రక్రియ. దీనిలోని లోపాలను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు ప్రజలను మభ్యపెడతారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నవారితోపాటు ఇంటర్నెట్లో వెతుకుతున్నవారి వివరాలను తెలుసుకుని ఫలానా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. అనంతరం వారికి ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకు ఖాతాలు, పాస్వర్డ్లు, ఓటీపీల వివరాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా డబ్బును కొల్లగొడతారు.