హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ సెబి సర్టిఫైడ్ కంపెనీ అంటూ నమ్మించి మాజీ ఐపీఎస్ అధికారి భార్యకు టోకరా వేసిన సైబర్‌నేరగాళ్లు ఆమె నుంచి రూ. 2.5 కోట్లు కొల్లగొట్టారు. బాధితురాలి భర్త గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించినట్టు తెలిసింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో చిట్కాలు చెప్తామంటూ ఆమెకు మొదట వాట్సాప్ సందేశం పంపించారు.
మార్కెట్‌పై ఆమెకు అవగాహన లేకపోవడంతో తన భర్త నంబరు కూడా వాట్సాప్ గ్రూపులో యాడ్ చేయించారు. స్టాక్స్‌లో 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించారు. ఆమెకు నమ్మకం కలిగించడానికి వాట్సాప్‌లో నకిలీ సెబి సర్టిఫికెట్ పంపింంచారు. దీంతో సైబర్ నేరగాళ్ల ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వరకు ఆ మాజీ ఐపీఎస్ భార్య ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు మొత్తం 19 లావాదేవీల్లో రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు.
మొదట కొంత లాభం చూపించి, ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు. తన డబ్బులు విత్ డ్రా చేసుకుంటానని చెప్పినా, ఇంకా డబ్బులు పెట్టాలని ఒత్తిడి చేశారు. పెట్టుబడి పెట్టకుంటే ఇప్పటివరకు పెట్టిన డబ్బు పోతుందని ఆమెను బెదిరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి,
పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.