హైదరాబాద్: పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రి వైద్యుడికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. నిమ్స్ ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్గా పని చేస్తున్న ఓ వైద్యుడు సెకండ్ హ్యాండ్ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగే ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో తన ఎలక్ట్రిక్ కుర్చీని అమ్మకానికి పెట్టాడు. అది చూసిన సైబర్ నేరగాళ్లు జితేంద్ర శర్మ పేరుతో ఆ వైద్యుడికి ఫోన్ చేశారు.
ఫోన్ మాట్లాడిన వ్యక్తి తన పేరు జితేంద్ర శర్మ అని, కూకట్పల్లిలో తనకు ఫర్నీచర్ దుకాణం
ఉందని పరిచయం చేసుకున్నాడు. కుర్చీ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కుర్చీ కొనుగోలుకు సంబంధించిన డబ్బు పంపేందుకు తన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని సూచించాడు. అది నమ్మిన వైద్యుడు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగా అతని ఖాతా నుంచి రూ.2.58 లక్షలు మాయమయ్యాయి. దాంతో మోసపోయినట్లు గ్రహించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.