హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు తప్పిందని, ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ విజయమేనని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కేసీఆర్ సర్కారు విద్యుత్తు సంస్కరణలు తెచ్చి వెలుగులు నింపితే, కాంగ్రెస్ సర్కారు కోతలతో ప్రజలను ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నలమోతు భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొంతకాలంగా ఈఆర్సీ ఎదుట వాదనలు వినిపించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కరెంట్ భారం మోపకుండా కాపాడుకున్నామని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో కడుపులు కాల్చుకొని పనిచేసి ఏటా 17 నుంచి 18 శాతం ఆదాయం పెంచామని, తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో రూ. 60వేల కోట్ల బడ్జెట్‌ను రూ. 2.60లక్షల కోట్లకు చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు తెలివితక్కువ నిర్ణయాలతో ఆరు నెలల్లోనే రాష్ట్ర ఆదాయం నాలుగువేల కోట్లు తగ్గిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఖజానాను దెబ్బతీసి జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్ పాలనలో కడుపుకట్టుకొని పనిచేసి వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తే..ఇప్పుడు చీటికి మాటికి కరెంట్ పోయే పరిస్థితి దాపురించింది’ అని మండిపడ్డారు. వరికోతలు మొదలై నెల దాటినా ఇప్పటివరకు మిల్లర్లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్నాలకే వర్తింపజేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. దేశంలోనే అత్యంత నాణ్యత కలిగిన తెలంగాణ పత్తికి కేంద్రం మద్దతు ధర ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. గుజరాత్లో క్వింటాకు రూ.8 వేలకు పైగా కొంటూ, మన పత్తికి కేవలం రూ.7521 మద్దతు ధర ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. తెలంగాణలో పండుగలప్పుడు నలుగురు కలిస్తే ఈ సర్కారు వణికిపోతున్నదని, అందుకే 163 సెక్షన్ పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దామగుండం, మూసీ ప్రాజెక్టు, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ మీద మాట్లాడాలని హితవు పలికారు.
పండుగల వేళ ప్రజలు ఇండ్లల్లో దావత్‌లు చేసుకోవద్దా? విందులకు కూడా పర్మిషన్లు తీసుకోవాలా? అంటూ జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ బంధువుల ఇంటిపై దాడులు చేయించిన రేవంత్‌రెడ్డి సాధించిందేమిటని నిలదీశారు. ‘న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన స్పెషల్ పార్టీ పోలీసులను తీసేసిన రేవంత్‌రెడ్డి, రేపు సాయుధ పోలీసులు తిరగబడితే ఏంచేస్తారు? చంద్రబాబుతో మాట్లాడి ఆంధ్రా పోలీసులను తెచ్చుకుంటారా?’ అని చురకలంటించారు.