హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): యాసంగిలో వడ్లు కొనేదిలేదని కేంద్రప్రభుత్వ మొండికేయటంతో రైతులు వరి పంటను వదిలి ఇతర పంటల సాగువైపు మళ్లుతున్నారు. యాసంగిలో ఇతర పంటల సాగు క్రమంగా పెరుగుతున్నది. ప్రభుత్వ సూచనతో నూనె గింజలు, పప్పు దినుసుల పంటల సాగు భారీగా పెరిగింది. శనగ, వేరుశనగ, జొన్న, మినుము పంటలను భారీగా సాగుచేస్తున్నారని యాసంగి సాగుపై వ్యవసాయశాఖ విడుదలచేసిన నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే యాసంగిలో 6,56,363 ఎకరాల్లో పంటలు వేయగా, ఇందులో వరి 400 ఎకరాల్లో మాత్రమే వేయటం గమనార్హం.
గత యాసంగిలో ఈ సమాయానికి వేసిన పంటలతో పోల్చితే ఈ సీజన్లో నూనె, పప్పు గింజల సాగు విస్తీర్ణం రెట్టింపైంది. వేరుశనగ పంటసాగు భారీగా పెరిగింది. గతేడాది ఈ సమయానికి 81,495 ఎకరాల్లో మాత్రమే వేరుశనగ పంట వేయగా, ఈ సీజన్లో 2.60 లక్షల ఎకరాలకు పెరగడం గమనార్హం. కుసుమల సాగు గతేడాది 3,720 ఎకరాల్లో చేయగా, ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 8 వేల ఎకరాల్లో వేశారు. గత సీజన్లో బొబ్బెర పంట మొత్తానికే వేయలేదు. ఈ సీజన్లో ఏకంగా 3,129 ఎకరాల్లో సాగుచేశారు. రైతులు యాసంగిలో క్రమంగా ఇతర పంటల సాగువైపు మళ్లటం మంచి పరిణామమని వ్యవసాయరంగ నిపుణులు, అధికారులు అంటున్నారు.