హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై కలెక్టర్లతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్షించారు. 20 జిల్లాల కలెక్టర్లతో పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పరిస్థితులు, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయని, అన్ని జలాశయాల వద్ద పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. చెరువు కట్టలు పటిష్టంపై చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జలాశయాల పరీవాహక ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.