Heavy Rains | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ)/న్యూస్‌నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలతో దాదాపు 25 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వానలు కొనసాగుతుండటంతో నష్టం పెరిగే అవకాశం ఉన్నదన్న అభిప్రాయపడుతున్నారు. వ్యవసా య శాఖ అధికారుల ప్రాథమిక నివేదికల ప్రకారం దాదాపు 12-15 లక్షల ఎకరాల పత్తి ,10 లక్షల ఎకరాల్లో వరి, 3 లక్షల ఎకరాల్లో మక్కజొన్నతోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నట్టుగా అధికారులు లెక్కలు వేస్తున్నారు.
జిల్లాల్లో పరిస్థితి ఇలా..
సూర్యాపేట జిల్లాలోని 19,696 ఎకరా ల్లో, నల్లగొండ జిల్లాలోని ఆరు మండలాల్లోని గ్రామాల పరిధిలో 648 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లాలో పంట పొలాలు నీట మునగడంతో వేల ఎకరాల్లో నష్టం జరిగింది. మొయినాబాద్ మండలంలోని అండాపూర్ వద్ద ఈసీ వాగు పంట పొలాల నుంచి పారడంతో సుమారు 100 ఎకరాల్లో పంట లు నీట మునిగాయి. వికారాబాద్ జిల్లాలో 1056 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.5 లక్షల ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 623 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.