హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ) : కృష్ణా జలాల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) ఏకపక్ష వైఖరి విమర్శలకు తావిస్తున్నది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఏపీ సర్కార్కే వత్తాసు పలుకుతూ ట్రిబ్యునల్ అవార్డు మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్నది. మూడు నెలలుగా బోర్డు మీటింగ్ ఏర్పాటుచేయకుండా తాత్సారం చేస్తూ జలాలు ఏపీకి మళ్లిపోయేలా పరోక్షంగా సహకరిస్తున్నది. రేవంత్ సర్కార్ చేష్టలుడిగి చూస్తుండటం వల్లే బోర్డు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రతి నీటి సంవత్సరానికీ(జూన్ నుంచి మే 31తేదీ వరకు) ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రీ మెంబర్ కమిటీ నిర్ణయిస్తుంది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ర్టాల ఈఎన్సీలతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్లవారీగా సమావేశమై అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, అవసరాలపై చర్చించాలి. ఇరు రాష్ర్టాలకు నీటివాటాలను నిర్ణయించాలి. ఆ మేరకు ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదలకు బోర్డు అనుమతులిస్తుంది. కానీ నీటి సంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఇప్పటివరకు త్రీ మెంబర్ కమిటీ సమావేశం ఏర్పాటుచేయలేదు.
నిజానికి జనవరిలోనే మీటింగ్ ఏర్పాటుచేస్తామని స్వయంగా ప్రకటించిన బోర్డు.. ఎజెండా, ఇండెంట్లను సమర్పించాలని డిసెంబర్ నెలలోనే ఇరు రాష్ర్టాలను కోరింది. కానీ ఇప్పటివరకూ ఊసెత్తలేదు. రిజర్వాయర్లలో జలాలను ఏపీ దర్జాగా తరలించుకుపోయేందుకే మీటింగ్ ఏర్పాటు చేయడం లేదని తెలిసిపోతున్నది. ఇండెంట్లు, ఆర్డర్లు లేకుండా నీళ్లు తరలిపోతున్నా, తెలంగాణ ఫిర్యాదు చేస్తున్నా బోర్డు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇందుకు బలం చేకూర్చుతున్నది. మూడు నెలలుగా రాష్ర్టాల ఫిర్యాదు లేఖలను అటూఇటు బట్వాడా చేసేందుకే బోర్డు
పరిమితమైంది.
కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నీటిని ఏ విధంగా, ఏ సమయంలో మళ్లించినా వాటిని ఆ రాష్ట్ర వినియోగ కోటా కిందనే జమకట్టాలి. బేసిన్ నుంచి మళ్లించిన ప్రతి చుక్కనూ సంబంధిత రాష్ట్ర కోటాలోనే వేయాలి. అవార్డు ఇంత స్పష్టంగా చెబుతున్నా బోర్డు మాత్రం ట్రిబ్యునల్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఏపీ చెబుతున్న లెక్కలకే వంతపాడుతున్నది. ఏపీ ఈ ఏడాది 690 టీఎంసీలకు పైగా జలాలను కృష్ణా నుంచి మళ్లించింది. అందులో 215 టీఎంసీలను వరదల సమయంలో మళ్లించామని, వాటిని తమ వినియోగ కోటాలో చూపవద్దంటూ అసంబద్ధ వాదనలకు దిగుతున్నది.
ఇంకా నీటి కోటా ఉన్నదని దబాయిస్తున్నది. దీనికి బోర్డు సైతం వత్తాసు పలుకుతున్నది. ఏపీ నీటి మళ్లింపులను నిలువరించాల్సింది పోయి.. తిరిగి ఏపీ వాదనలపై అభిప్రాయాలను తెలుపాలని తెలంగాణను కోరడం బోర్డు అత్యుత్సాహానికి అద్దం పడుతున్నది. అంతేగాక తాగునీటికి వినియోగించుకునే జలాల్లో కేవలం 20శాతాన్ని మాత్రమే లెక్కగట్టాలని ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంగా చెతున్నది. ఆ మేరకే నీటికోటాను కౌంట్ చేయాలని తెలంగాణ దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నది. కానీ అవార్డును మాత్రం అమలు చేయకుండా, 100శాతం జలాలను లెక్క గడుతున్నది బోర్డు. కానీ ఏపీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
కుడివైపు హెడ్‌రెగ్యులేటరీ మరమ్మతులు, డ్యామ్‌కు సంబంధించిన 13 గేట్ల నిర్వహణను ఏపీనే అక్రమంగా స్వాధీనం చేసుకున్నది. కనీసం మరమ్మతులు కూడా చేపట్టకుండా తెలంగాణను అడ్డుకుంటున్నదే ఏపీ. తామే నిర్వహించుకుంటామని ఫిర్యాదు చేయడంతో పాటు బోర్డు మీటింగుల్లోనూ ఏపీ గగ్గోలు పెడుతూ వచ్చింది. కానీ ఆచరణలో డ్యామ్ నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. హెడ్ రెగ్యులేటరీ గేట్లను ఇష్టారాజ్యంగా ఆపరేట్ చేయడం, గ్రీజింగ్ తదితర పనులను నిర్వహించకపోవడంతోపాటు అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గేట్లు ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకున్నట్టు తెలుస్తున్నది.
ఇటీవల ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం డ్యామ్‌ను సందర్శించి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగానే ఏపీ ప్లేటు ఫిరాయించింది. తెలంగాణ కారణమంటూ మొండివాదనలు చేస్తూ బోర్డుకు లేఖ రాసింది. గేట్లు స్వాధీనం చేయాలని తెలంగాణ ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందించని బోర్డు, ఏపీ లేఖ రాసిందే తడవుగా తెలంగాణను వివరణ కోరింది. పైగా మరమ్మతులు చేయాలని తెలంగాణకే హుకుం జారీ చేయడం బోర్డు ద్వంద్వ వైఖరిని స్పష్టంచేస్తున్నది.
సాగర్, శ్రీశైలం ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి రికార్డు స్థాయిలో ఏపీ ఈ ఏడాది కృష్ణా జలాలను దోచుకుపోయింది. తీరా ఇప్పుడు ప్రస్తుతమున్న జలాలు మొత్తం కావాలని డిమాండ్ చేయడం, అందుకు అనుమతివ్వాలా? అంటూ బోర్డు అడుగడం గమనార్హం. సాగర్‌లో ప్రస్తుతం 183టీఎంసీలు ఉండగా, 510ఫీట్ల ఎండీడీఎల్ స్థాయిలో వినియోగానికి అందుబాటులో ఉండేవి కేవలం 52టీఎంసీలు మాత్రమే. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతం 80టీఎంసీలు ఉండగా, అందులో ఎండీడీఎల్ స్థాయిలో వినియోగానికి అందుబాటులో ఉండేవి కేవలం 26టీఎంసీలు మాత్రమే.
మొత్తంగా రిజర్వాయర్లలో కలిపి వినియోగానికి అందుబాటులో ఉన్నవే 78 టీఎంసీలు. కానీ తనకే 73 టీఎంసీలు కావాలని మళ్లీ తాజాగా డిమాండ్ చేయడం గమనార్హం. సాగర్ కుడికాలువ కింద స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయని, సాగునీటితో పాటు వేసవి తాగునీటి అవసరాలకు 73టీఎంసీలు అవసరమని, ఆ మేరకు సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్‌ను తాము ఆపరేట్ చేసుకునేలా సీఆర్పీఎఫ్కు ఆదేశాలివ్వాలని బోర్డును ఏపీ తాజాగా కోరింది. ఇంతకాలం చోద్యం చూస్తూ వచ్చిన బోర్డు సైతం ఇప్పుడు ఏపీ ప్రతిపాదనలు పెట్టగానే హడావుడిగా స్పందించింది. ఏపీ ప్రతిపాదనలపై అభిప్రాయం చెప్పాలని తెలంగాణను కోరుతూ హుటాహుటిన లేఖ రాయడం బోర్డు ఏపీకి ఏస్థాయిలో వంతపాడుతున్నదో తేటతెల్లమవుతున్నది. త్రీమెంబర్ కమిటీ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యమేమిటో సైతం స్పష్టంగా తెలిసిపోతున్నది.
ఏపీ బరితెగింపునకు, బోర్డు వ్యవహారశైలికి చేవలేని తెలంగాణ కాంగ్రెస్ సర్కారే కారణమేనని ఇంజినీర్లు చెబుతుంటే, గుట్టుగా ఏపీకి సహకరిస్తున్నదని నీటిరంగ నిపుణులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ నీటి సంవత్సరం మొదటినుంచే ఏపీ నిరాటంకంగా కృష్ణా జలాలను తరలిస్తున్నది. డిసెంబర్ నాటికే పోతిరెడ్డిపాడు ద్వారా దాదాపు 180 టీంఎంసీలు మళ్లించింది. విషయాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇంజినీర్లు తెలంగాణ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారు.
పదుల సంఖ్యలో లేఖలు రాశారు. ఏపీని అడ్డుకోవాలని ఉన్నతాధికారులు సైతం నేరుగా బోర్డు చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం స్పందించింది లేదు. బోర్డును నిలదీసింది లేదు. త్రీమెంబర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయకున్నా ఇదేమిటనీ రివర్ బోర్డును కాంగ్రెస్ సర్కార్ నిలదీయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏపీని అడ్డుకోవాలని బోర్డుపై తెలంగాణ సర్కార్ ఒత్తిడి తీసుకురాకపోవడం గమనార్హం. తెలంగాణ సర్కార్ వైఫల్యం కంటే ఏపీకి పరోక్షంగా సహకరించడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొన్నదని ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.