హైదరాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : కమ్యూనిజం, ప్రజాపోరాటాలపై పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రాంతీయ, భాషా విభేదాలను రెచ్చగొట్టేలా, పీడిత ప్రజల వర్గ పోరాటాలను అవమానించేలా మాట్లాడటం తగదని రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో ఆక్షేపించారు.
ప్రపంచంలో పెట్టుబడిదారులు, దోపిడీ వర్గాలు ఉన్నంత కాలం శ్రామిక వర్గాల తరఫున ఎర్రజెండా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. పవన్ పూర్తిగా బీజేపీ, ప్రధాని మోదీ అజెండాకు అనుగుణంగా మతోన్మాద, విద్వేష రాజకీయాలను తెలంగాణలో చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇకడి ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేస్తున్న చర్యలను తెలంగాణ సమాజం ఎన్నిటికీ ఆమోదించదని తేల్చిచెప్పారు. ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని దెబ్బతీసేందుకు ఢిల్లీ, ఆంధ్రా పాలకుల ఆధ్వర్యంలో తెరవెనుక కుట్రలు జరుగుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు తెలంగాణ సమాజం, యువత తిరిగి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఏఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం(టాస్క్) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలంగాణ అస్తిత్వం-మన కర్తవ్యం’ సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్రమైన డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని సీతారామారావు పేర్కొన్నారు. మోదీ సారథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు వ్యూహాలు పన్నుతున్నారని ఆరోపించారు. ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. 1952 నాటి ఇడ్లీ-సాంబార్ గోబ్యాక్ ఉద్యమం నుంచి తెలంగాణ అస్తిత్వ పోరాటం మొదలైందని గుర్తుచేశారు.