కారేపల్లి, సెప్టెంబర్ 10 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో గల ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. గాంధీనగర్ గేటు, కొమ్ముగూడెం నుంచి గాంధీనగర్ వరకు ఇల్లెందు ప్రధాన రహదారిపై పడిన గుంటలు వల్ల వాహనదారులు ప్రమాదాల భారిన పడుతున్నట్లు తెలిపారు. గాంధీ నగర్ గేటు వద్ద జరిగిన నిరసనను ఉద్దేశించి సీపీఎం సింగరేణి మండల కార్యదర్శి కె.నరేంద్ర మాట్లాడుతూ.. కొమ్ముగూడెం నుంచి గాంధీనగర్ వరకు ఇల్లెందు ప్రధాన రహదారి జల్లెడలా మారి మోకాలు లోతు గుంటలు పడి ప్రమాదాలకు కారణమవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నడపడం డ్రైవర్లకు కత్తి మీద సాముగా మారిందన్నారు. ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఖమ్మం ప్రధాన రహదారికి నిధులు ఇవ్వని దుస్థితి ఉండడం ఏంటని ఆయన విమర్శించారు. కొత్త రోడ్లకు కమీషన్లు వస్తాయి, పాత రోడ్లకు కమీషన్లు రావు కాబట్టి నిర్మించడం లేదా అని ప్రశ్నించారు. మంత్రులే కాకుండా ఇల్లెందు, వైరా తదితర నియోజకవర్గ ఎమ్మెల్యేలు సైతం నిత్యం ఈ రహదారులపై తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గమనించకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. దెబ్బతిన్న రోడ్డు సమస్యను ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మించాలని లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి ఉధృతమైన పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు వజ్రామారావు, మండల కమిటీ సభ్యులు కేశగాని ఉపేందర్, సీనియర్ నాయకులు కేశగాని రామ్మూర్తి, ఈసాల పగడయ్య, ఎజు రత్నం, రాగూరి రమేశ్, ఎండీ ఇస్మాయిల్, కె.నీలిమ పాల్గొన్నారు.