అలంపూర్ : ఇథనాల్ ఫ్యాక్టరీని 9Ithanal Factory) వ్యతిరేకిస్తు అరెస్టయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఎం నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టు (CPM leaders arrest) చేశారు. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించిన 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ , శ్రీరామ్ నాయక్ , జోగులాంబ గద్వాల జిల్లా సీపీఎం కార్యదర్శి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులను మార్గమధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకొని గద్వాల వన్‌టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతు పక్షాన పోరాటం చేస్తున్న సీపీఎం నాయకులను అరెస్టు చేయడం దారుణమని జాన్వెస్టీ ఖండించారు.
బాధలో ఉన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు వెళితే ముందస్తుగా అరెస్టు చేయడం అనైతికమని, ప్రజాస్వామికవాదులు, అభ్యుదయ వాదులు, ప్రజాసంఘాల నాయకులు , విద్యావేత్తలు ఖండించాలని కోరారు. రిమాండ్ కు తరలించిన 12 మంది రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.