నీలగిరి, ఆగస్టు 15: డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొంతమంది చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లసాధన కమిటీ పేరుతో అందోళనలు చేసిన సీపీఎం నేతలు ఈ అక్రమాలను సభ వద్ద బయలు చేస్తారనే భయంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీపీఎం కార్యాలయంలోకి వెళ్లి మందస్తు అరెస్టులు చేశారు.
వివరాల్లోకి వెళితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌధంలో ఒకటైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం పట్టణ శివారులోని కలెక్టరేట్ సమీపంలో 24 బ్లాకుల్లో 576 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో తాగునీరు, రోడ్లు, ఇతర పలు మౌలిక సదుపాయాల కల్పన కోసం రెండున్నర సంవత్సరాల పాటు ప్రస్తుత అధికార పార్టీ నాయకులు సమయం తీసుకుని వాటిని పూర్తి చేశారు. శనివారం వాటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు.
రీ సర్వేలో పేర్లు మార్చిన విధానం, 131 మంది జాబితాను మార్చడంపై డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ సందర్భంగా ఆందోళన చేస్తారని ముందస్తుగా సీపీఎం నేతలను అరెస్ట్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం అనే విషయాన్ని మర్చిన పోలీసులు ఏకంగా పార్టీ కార్యాలయంలోకి చొరబడి మరీ అరెస్టు చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. 2017లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్లను 2023లో 24 బ్లాకుల్లో 576 గృహాలుగా పూర్తిచేశారు.
20వేలకు పైగా దరఖాస్తులు రాగా 552 మందిని ఎంపిక చేశారు. అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో వాటిని పక్కన పెట్టారు. సీపీఎం, బీఆర్ఎస్ నేతలు వాటిని పంపిణీ చేయాలని పలుమార్లు ఆందోళనలు చేశారు. దీంతో అధికారులు గత నవంబర్లో రీ సర్వే చేపట్టారు. ఎంపిక చేసిన 421 మంది లబ్ధిదారుల్లో నుంచి 30 మంది వరకు తొలగించారు. వీరే కాకుండా వివిధ కారణాలతో ఎంపిక చేసిన 131 మంది జాబితాను మార్చి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లు జాబితాలో చేర్చారు.