చేగుంట, మార్చి 09 : వారిద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లైనప్పటి నుంచి ఒకరిని విడికి ఒకరు ఉండలేని పరిస్థితి. అలా వారి సంసార జీవితం సాగుతూ వచ్చింది. అంతలోనే భర్తను అనారోగ్యం చుట్టుముట్టింది. దీంతో భర్త మృతి చెందగా.. ఆయన చనిపోవడాన్ని తట్టుకోలేక మూడు రోజులకే భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణాల్పల్లి గ్రామంలో వెలుగు చూసింది.
గ్రామానికి చెందిన చింతాకుల అయ్యలం(65) మూడు రోజుల క్రితం మృతి చెందాడు. అయితే అనారోగ్యం కారణంగా భర్త చనిపోవడంతో.. భార్య కూడా తీవ్ర మనోవేదనకు గురైంది. భార్య కొమురవ్వ(60) భర్త మృతి తట్టుకోలేక ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.