Counting : నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం ఓట్ల లెక్కింపు (Vote Counting) నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగే అవకాశమున్న 11 జిల్లాలను అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించింది. ఆయా జిల్లాల్లో హై అలర్ట్ (High Alert) ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, కూచ్ బెహార్, మాల్దా, నాడియా, బీర్భూం, పశ్చిమ మేదినీపూర్, హుగ్లీ తదితర జిల్లాలు ఉన్నాయి.
ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో ఎటువంటి హింస, అల్లర్లు జరగకుండా ఉండేందుకు అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలను హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మంది కేంద్ర పారామిలిటరీ దళాలను మోహరించినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నారు. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల అధునాతన ‘మార్క్స్‌మ్యాన్’ సాయుధ వాహనాలను రంగంలోకి దించారు. బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల్లో అదనపు నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేయకుండా అడ్డుకునేందుకు రాజకీయ పార్టీల సోషల్ మీడియా అకౌంట్లు, వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎన్ఐఏ అధికారులు నిఘా ఉంచారు. ఇదిలావుంటే అధికారిక లెక్కల ప్రకారం.. 2011 ఎన్నికల సమయంలో కౌంటింగ్ సందర్భంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016 ఎన్నికల సందర్భంగా 30 మంది మృతిచెందగా.. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అత్యధికంగా 58 మంది మరణించారు. మళ్లీ అటువంటి హింస జరగకుండా నివారించేందుకు ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.