Indian Ship : హార్ముజ్ జలసంధి వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఒకపక్క అమెరికా దిగ్బంధనం, మరోపక్క ఇరాన్ అడ్డగింత మధ్య అనేక నౌకలు ఇంకా అక్కడే చిక్కుకుపోయాయి. ఇలాంటి పరిస్తితుల్లో ఒక భారత చమురు నౌక విజయవంతంగా ఈ జలసంధిని దాటినట్లు తెలుస్తోంది. మార్షల్ ఐలాండ్‌కు చెందిన సర్వ శక్తి అనే నౌక 45,000 టన్నుల ఎల్పీజీతో బయల్దేరింది.
శనివారం ఈ నౌక ఇరాన్ పరిధిలోని లరాక్ అండ్ క్వెష్మ్ ఐలాండ్ దాటి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరం చేరుకున్నట్లు ట్రాకింగ్ సమాచారం ద్వారా తెలుస్తోంది. హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించిన తర్వాత ఒక భారత నౌక ఇలా హార్ముజ్‌ను దాటడం ఇదే మొదటిసారి. అందులోనూ ఇంతపెద్ద నౌక ఇలా దాటడం కూడా చాలా అరుదు. ప్రస్తుతం హార్ముజ్ వద్ద నౌకల కదలికలు బాగా తగ్గిపోయాయి. గత నెలలో కొన్ని గంటలు మాత్రమే హార్ముజ్ దాటేందుకు ఇరాన్ అనుమతించింది. ఆ తర్వాత వెంటనే హార్ముజ్‌ను ఇరాన్ మూసేసింది. మరోవైపు అమెరికా కూడా ఈ జలసంధిని దిగ్బంధించింది. ప్రస్తుతం ఇండియాకు వస్తున్న సర్వ శక్తి చమురు నౌక గతంలో కూడా పర్షియన్ గల్ఫ్ పోర్టు, ఇండియన్ పోర్టుల మధ్య ప్రయాణించేది.
ఈ నౌకలో భారత సిబ్బంది కూడా ఉంటారు. ఈ నౌక నుంచి వస్తున్న చమురును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొనుగోలు చేయనుంది. ఈ నౌక పర్షియన్ గల్ఫ్ పరిధిలోకి గత ఫిబ్రవరిలో చేరుకుంది. ఇది దుబాయ్‌కు చెందిన ఫోర్‌సైట్ గ్రూప్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియాలో చమురు సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలాంటి చమురు నౌకల రాక వల్ల కొంత ఉపశమనం కలగనుంది.