హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ‘పాలన అంతా బాగున్నది’ అన్ని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ సర్కారు డొల్లతనం శాసన మండలి సాక్షిగా బట్టబయలైంది. క్షేత్రస్థాయిలో రైతుల దయనీయ పరిస్థితిని సోమవారం జరిగిన మండలి సమావేశాల్లో ఏకంగా చైర్మన్ కూడా బయటపెట్టడంతో ఉప ముఖ్యమంత్రి కంగుతినాల్సి వచ్చింది. కాంగ్రెస్ వచ్చాకనే రైతులకు మేలు జరుగుతున్నదని చెప్తున్న పాలక పె ద్దలు కనీసం రైతుల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా పట్టించుకోవడం లేదని తేలిపోయింది. మండలి సభ్యుడు లేవనెత్తిన రైతు సమస్యలు తమ ఊరిలో కూడా ఉన్నాయని చైర్మనే చెప్పడంతో ఈ సాక్ష్యం చాలని చర్చ నడుస్తున్నది.
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు నాలుగైదు రోజులు పడుతున్నదని, ఇందుకయ్యే ఖర్చులు కూడా రైతులే భరించాల్సి వస్తున్నదని ప్రస్తావించారు. ఇందుకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం ఇస్తూ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, సభ్యుడు ఎప్పటి విషయాలనో ప్రస్తావిస్తున్నారంటూ కొట్టిపారేశారు. ఇందుకు సత్యం స్పందిస్తూ ‘సమస్య ఉన్నమాట ముమ్మాటికీ వాస్తవం.. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవకర్గంలోని అన్ని మండలాల్లో ఇలాంటి పరిస్థితే ఉన్నది’ అని స్పష్టంచేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కల్పించుకొని ‘సభ్యుడు చెప్పింది వాస్తవమే.. మా ఊరిలోనూ ఈ సమస్యలు ఉన్నయి’ అని చెప్పడంతో భట్టి తెల్లముఖం వేశారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సమస్యలను పరిష్కరిస్తానని దాటవేశారు.
‘విద్యుత్తు రంగంలో సంస్కరణలు తెచ్చినం.. పొలంబాట నిర్వహిస్తున్నం.. సమస్యల పరిష్కారానికి 108 తరహా లో అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినం. 1912 నంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే వెహికిల్‌లో సిబ్బంది వచ్చి ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేస్తున్నరు’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండలిలో చెప్పింది నిజం కాదని స్వయంగా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘డిప్యూటీ సీఎం చెప్తున్న పొలంబాట క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. నేను ఊరికి వెళ్లినప్పుడు డీఈకి ఫోన్ చేస్తే గానీ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసే పరిస్థితి లేదు’ అని కుండబద్ధలు కొట్టారు. గుత్తా వ్యాఖ్యలతో మల్లు భట్టి విక్రమార్క షాక్‌కు గురయ్యారు.