Phone Tapping | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ప్రత్యర్థి పార్టీల నేతలపై రాజకీయంగా కక్ష సాధించేందుకు పోలీసు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పరాకాష్టకు చేరుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలక పగ్గాలు అందిపుచ్చుకున్న నాటి నుంచి ఈ ధోరణి పెచ్చుమీరిపోయిందని, ఆ అడుగులు కోర్టు మెట్లు ఎకే వరకు దిగజారుతున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా అధికార పార్టీ నేతలు ప్రత్యర్థులపై కేసులు పెట్టి కోర్టుల్లో సా&.గదీస్తుంటారు. కోర్టు ఆ కేసులు వీగిపోగానే ఇక వాటికి స్వస్తి చెప్తుంటారు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఓ ప్రైవేట్ వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదును హైకోర్టు కొట్టివేసినా.. దానిని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి ప్రభుత్వ ఖర్చుతో వాదనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పంజాగుట్ట పోలీసులు పెట్టిన కేసు వీగిపోయిన తర్వాత కూడా పట్టువదలని విక్రమారుడిలా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి అభాసుపాలు కావడం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చడమేనని పరిశీలకులు విమర్శిస్తున్నారు.
కేసుల వెనుక రాజకీయ శత్రుత్వం
మాజీ మంత్రి హరీశ్‌రావు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతో తన ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ నాయకుడు చక్రధర్‌గౌడ్ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏడాది ఆలస్యంగా ఫిర్యాదు చేసినా పోలీసులు దానిని పరిగణనలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరిగినప్పుడు.. హరీశ్‌రావుపై ఫిర్యాదుదారునికి రాజకీయ శత్రుత్వం ఉన్నదని, అతడి అభియోగాలకు ఆధారాలు లేవని పేర్కొంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. రాధాకిషన్‌రావుకు కూడా ఊరట ఇవ్వడంపై చక్రధర్‌గౌడ్ ఎస్ఎల్పీ దాఖలు చేస్తే దానిని సుప్రీంకోర్టు గత ఏప్రిల్‌లోనే కొట్టివేసింది. కాగా హరీశ్‌రావుపై హైకోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల తర్వాత పోలీసులతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయించింది. ఫిర్యాదుదారుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కావడం వల్లనే అతడు చేసిన వ్యక్తిగత ఫిర్యాదుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయడాన్ని న్యాయకోవిదులు తప్పుపడుతున్నారు. ఒక కేసులో హైకోర్టు తీర్పు వెలువరించాక అదే కేసులో ఓడిపోయిన అంశాలపైనే ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేయించడాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని న్యాయనిపుణులు గుర్తుచేస్తున్నారు.
పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం
హరీశ్‌రావుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ముందూవెనుక ఆలోచించకుండా భేషజాలకు పోయి పరువు పోగొట్టుకున్నదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని హరీశ్‌రావును రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలన్న దురాలోచననే ప్రభుత్వ పరువును బజారుకీడ్చిందని విమర్శిస్తున్నారు. ఏదైనా కేసులో తీర్పుపై అప్పీల్ చేయాలంటే న్యాయపరమైన కసరత్తు జరుగుతుందని, గెలుపుఓటముల కంటే ముందు అప్పీల్ చేసేందుకు ఉన్న అవకాశాలను న్యాయనిపుణులతో ప్రభుత్వం చర్చిస్తుందని వారు గుర్తుచేస్తున్నారు. ఆ చర్చల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఎస్ఎల్పీ వేస్తారని తెర వెనుక జరిగే కసరత్తును గుర్తుచేస్తున్నారు. ఓడిపోయిన కేసులో అదీ ఒక ప్రైవేట్ వ్యక్తి వేసిన కేసులో పోలీసుల ద్వారా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎకి తన పరువును తానే తుంగలోకి తొక్కిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కత్తికి లేని దురద కందకెందుకు?
ఒక వ్యక్తిపై మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అది ఇద్దరి వ్యక్తుల మధ్య వివాదం. ఫిర్యాదు చేసిన వ్యక్తికి పోలీసుల దర్యాప్తు ద్వారా కింది కోర్టులో న్యాయం జరుగకపోతే.. అతడే పై కోర్టుకు అప్పీలు చేసుకోవడం రివాజు. ఒకవేళ ఆ కేసులో ప్రభుత్వ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉంటే లేదా ప్రభుత్వం కూడా ఆ కేసులో ఒక కక్షిదారుగా ఉంటే అప్పుడు సర్కార్ కూడా పై కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కేసులో చక్రధర్‌గౌడ్ వ్యక్తిగత హోదాలోనే (ఏడాది ఆలస్యంగా) హరీశ్‌రావుపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును హరీశ్‌రావు హైకోర్టులో సవాలు చేశారు. చక్రధర్‌గౌడ్ చేసిన ఫిర్యాదులో తగిన ఆధారాలు లేవంటూ హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.
ఎటువంటి ఆధారాలు లేకుండా ఓ ప్రైవేటు వ్యక్తి చేసిన అభియోగాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసును సొలిసిటర్ జనరల్ లేదా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కాకుండా ఓ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ప్రభుత్వం నియమించింది. ఒక ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేసిన కేసులో ప్రజాధనంతో సీనియర్ న్యాయవాదిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఎకడిదని న్యాయనిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు వ్యతిరేకంగా చక్రధర్‌గౌడ్ వేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసిన అనుభవం కండ్ల ముందు కనిపిస్తున్నా.. ప్రభుత్వం గుడ్డిగా హరీశ్‌రావుకు వ్యతిరేకంగా ఎస్ఎల్పీని వేయించడంపై.. కత్తికి లేని దురద కందకెందుకని కాంగ్రెస్ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి.