మంచిర్యాల, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడం.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ల కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన వారు అధిక స్థానాల్లో గెలవడంపై అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నియోజకవర్గంలో 50 శాతం నుంచి 60 శాతం మధ్యలో సర్పంచ్ స్థానాలు గెలిస్తే, ఆయన ఇన్చార్జిగా ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పార్టీ రెండో స్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఉమ్మడి జిల్లాలో మరో మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ 50 శాతానికి కంటే తక్కువ సర్పంచ్ స్థానాల్లో గెలిచింది. రాష్ట్రంలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ నియోజకవర్గంలో లేని విధంగా చెన్నూర్‌లో అత్యధికంగా 32 స్థానాల్లో ఇండిపెండెంట్ సర్పంచ్‌లు గెలిచారు. నియోజకవర్గంలో 98 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 48 గ్రామాల్లోనే గెలిచారు. మంత్రి వివేక్ ఇన్చార్జిగా ఉన్న సిద్దిపేట జిల్లాలోనూ అధికార పార్టీకి చుక్కెదురైంది. రాష్ట్రంలో మంత్రుల నియోజకవర్గాలవారీగా చూసుకుంటే అటు ఇన్చార్జి మంత్రి జూపల్లి, ఇటు వివేక్ ఇద్దరూ ఇతర మంత్రుల కంటే వెనుకబడి ఉండడంపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. దీంతో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లితోపాటు మంత్రి వివేక్ విషయంలో పార్టీ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతున్నది.
సీరియస్‌గా తీసుకోలేదా..
అటు ఇన్చార్జి మంత్రి, ఇటు మంత్రి సర్పంచ్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకపోవడమే ప్రతికూల ఫలితాలకు కారణమంటూ సొంత పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు మంత్రులు ఉండి ఏం చేశారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని వేరే వారిని సర్పంచ్‌లుగా బలపరిచారని, అందుకే మంత్రి వివేక్ ప్రచారం చేసిన గ్రామాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారనే చర్చ నడుస్తున్నది.
మంత్రి సీరియస్‌గా తీసుకోకుండా చెన్నూర్, క్యాతన్‌పల్లికి చెందిన ఇద్దరు షాడో ఎమ్మెల్యేలకు అధిక ప్రయార్టీ ఇవ్వడం, వాళ్లు చెప్పిన వారినే సర్పంచ్ అభ్యర్థులుగా బలపర్చడం అసలు మోసానికి వచ్చిందంటున్నారు. ఇక ఇన్చార్జి మంత్రి జూపల్లి తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార కార్యక్రమాలు తప్ప పార్టీ బలోపేతం దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, అసలు ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఆరెడు నెలలు అవుతున్నా.. మంచిర్యాల జిల్లాలోనే పర్యటించలేదని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రి పట్టింపులేని కారణంగానే సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మున్సి‘పల్స్’ కష్టమే..
మంత్రులు ఇదే పద్ధతుల్లో ముందుకు వెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో జనాల పల్స్ పట్టుకోవడం కష్టమనే చర్చ ఉమ్మడి జిల్లాని కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నది. మంచిర్యాల జిల్లాలో ఓ మున్సిపాలిటీలో కౌన్సిలర్ టికెట్లను అధికార పార్టీ లీడర్ ఒకరు బేరం పెట్టినట్లు, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు ఇచ్చిన వారికే టికెట్లు అని ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితి ఉంటే మున్సిపల్ ఎన్నికల్లోనూ చేతులు ఎత్తేయడం కాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంత్రులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, టికెట్ల కేటాయింపును షాడోలకు వదిలేయకుండా స్వయంగా మానిటరింగ్ చేసి, క్షేత్రస్థాయిలో రియాల్టీ తెలుసుకొని ఇవ్వాలని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ముందు నుంచి పార్టీనే పట్టుకొని ఉన్నవారికి టికెట్లు ఇవ్వకపోతే రెబల్స్‌గా పోటీ చేస్తున్నారని, దాంతో ఓట్లు చీలిపోతున్నాయని సర్పంచ్ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందంటున్నారు. ఇన్చార్జి మంత్రి, మంత్రి ఇప్పటి నుంచి మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించాలని, లేనిపక్షంలో పార్టీకి ఇబ్బందులు తప్పవని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు.
ముఖ్య నేతల రాజీనామా?
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందని ప్రచారం జరుగుతున్నది. పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల్లో కొందరు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సర్పంచ్‌లతోపాటు పార్టీ సీనియర్ లీడర్లు ఇదే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ముందు నుంచి పార్టీనే పట్టుకొని ఉన్న వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి ప్రయార్టీ ఇవ్వకపోవడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, గ్రామాల్లో ఎక్కడికి వెళ్లిన జనాలు వ్యతిరేకత వెల్లగక్కుతుండంతో పార్టీని వదలాలని కొందరు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ లీడర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్‌ను పార్టీలోకి తీసుకొచ్చి ఆయన్ని మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెడుతారంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం చక్కర్లు కొడుతున్నది. పైగా సదరు నాయకుడు శనిగకుంట మత్తడి పేల్చివేత కేసులో ఉన్నాడని, ఆయన భూముల రక్షణ కోసం కాంగ్రెస్‌లో చేరి, మున్సిపల్ చైర్మన్ కావాలని చూస్తున్నారంటున్నారు. అలాంటి వాళ్లను పార్టీలో ప్రోత్సహిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ హస్తం పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పార్టీకి రాజీనామా చేస్తే అది ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని, సర్పంచ్‌లు, ముఖ్య నేతలు ఎవ్వరూ రాజీనామాలు చేయడం లేదంటూ ఆ పార్టీ పెద్దలు చెప్తున్నారు. దీంతో చెన్నూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.