న్యూఢిల్లీ, మార్చి 15: దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఒప్పందాలు, విలీనాలు జరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటుండటంతో కార్పొరేట్ సంస్థలు భారీ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. గత నెలలో 226 విలీనాలు-కొనుగోళ్లు జరగగా, వీటి విలువ 7.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయని గ్రాంట్ థార్టన్ భారత్ పేరుతో విడుదల చేసిన నివేదికలో డీల్ట్రాకర్ వెల్లడించింది. ఒప్పందాల పరంగా చూస్తే 67 శాతం అధికమవగా, విలువ పరంగా చూస్తే 5.4 రెట్లు పెరిగాయి. వీటిలో 85 విలీనాలు అండ్ కొనుగోళ్లు జరగగా, వీటి విలువ 4.8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నదని పేర్కొంది. ఒప్పందాల్లో జెన్ టెక్నాలజీ, నిట్కో లిమిటెడ్‌లు నాలుగు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతోపాటు ఓఎన్జీసీ-ఎన్టీపీసీ గ్రీన్ 2.3 బిలియన్ డాలర్లతో అయాన రెన్యూవబుల్ పవర్‌ను కొనుగోలు చేశాయి. అలాగే ప్రణా గ్రూపు 755 మిలియన్ డాలర్లతో ఒవెన్స్ కార్నింగ్స్ గ్లాస్‌ను కొనుగోలు చేసింది. ప్రైవేట్ ఈక్విటీ ఒప్పందాలు 141 జరగగా, వీటి విలువ 2.4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నది