మంత్రాలయం, మార్చి 4 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి తుంగభద్ర నదీజలాలతో అభిషేకం, పాదపూజ, పంచామృతాభిషేకం చేశారు. మూలబృందావనాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతలు ఇచ్చారు. అనంతరం ఊయల మండపంలో బంగారు సింహాసనంపై రాఘవేంద్రస్వామిని అధిష్టింపజేసి బంగారు పాదుకలను వెండి, బంగారు నాణేలు, ముత్యాలు పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీమఠంలోని ప్రాకారంలో స్వర్ణరథంపై ఆశీనులై రాఘవేంద్రుడిని భక్తుల హర్షధ్వానాలు, భాజాభజంత్రీల మధ్యన మఠం ప్రాకారం చుట్టూ ఊరేగించారు. అం తకుముందు గ్రామదేవత మంచాలమ్మకు పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి, శ్రీపతి, ఓఎస్డీ శ్రీనివాసరావు, మేనేజర్ వెంకటేశ్ జ్యోషి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నర్సింహస్వామి, ధార్మిక అధికారి శ్రీపతి, వ్యాసరాజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.