మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad) ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షం (Heavy Rain)కురుస్తున్నది. మండల కేంద్రంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గూడూరు మండలానికి కేసముద్రం, నెక్కొండ మండలాల వైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటవీ ప్రాంత గ్రామాలైన ఊట్ల, కొంగర గిద్ద, దొరవారి తిమ్మాపురం గ్రామాల పరిధిలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద ప్రవహిస్తుండటతో దొరవారి తిమ్మాపురం గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి.
కొత్తగూడ మండలం కొత్తపల్లిలో రాత్రి నుంచి ఆగకుండా వాన పడుతున్నది. దీంతో కొత్తపల్లి శివారు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్నది. రాళ్లతొట్టు వాగు ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటకుండా పోలీసులు బారికేట్లు ఏర్పాటుచేశారు.