న్యూఢిల్లీ, జనవరి 21: దీర్ఘకాలికంగా ఎడాపెడా విటమిన్లు వాడడం ప్రమాదకరమని, క్యాన్సర్కు దారితీయవచ్చని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. విటమిన్ లోపం ఏర్పడితే ఆహార పదార్థాల ద్వారానే దానిని భర్తీ చేసుకోవడం మంచిదని టఫ్ట్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా ఏ, కే విటమిన్, మెగ్నీషియం, జింక్ వంటివి శరీరంలో లోపించినప్పుడు సమతుల ఆహారం ద్వారానే వాటిని పొందాలని, మాత్రలతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని అంటున్నారు. విటమిన్ బీ-12 మాత్రలను ఎక్కువ కాలం వాడితే ఊపిరితిత్తులు, పెద్దపేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గుండెజబ్బులతో సహా ఎన్నోరకాల వ్యాధులను నివారించి థైరాయిడ్ పనితీరును మెరుగుపర్చే సెలీనియం వినియోగంలో జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. సెలీనియం మాత్రల డోసు శ్రుతిమించితే పురుషుల్లో క్యాన్సర్ ముప్పు 91 శాతం పెరుగుతుందట. అలాగే విటమిన్ ఈ డోసు పెరిగితే క్యాన్సర్ ముప్పు 111 శాతం పెరుగుతుందట. అందువల్ల సదరు విటమిన్ మాత్రలు వైద్యుని పర్యవేక్షణలో పరిమితంగానే తీసుకోవాలనేది అధ్యయనాల సారాంశం.