యాచారం, మే26: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. అంజయ్య ఆరోపించారు. సోమవారం మండలంలోని మాల్ గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి మహాధర్నా కరపత్రం ఆవిష్కరించారు.
అనంతరం పి.అంజయ్య మాట్లాడుతూ.. వ్యవసాయానికి వ్యతిరేకంగా కేంద్రం మూడు నల్ల చట్టాలు తెచ్చిందని, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ఉపాధి కూలీలకు రూ.307లు చెల్లించాలని చట్టం చేసిందని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా రూ.200 మాత్రమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ప్రతి కూలీకి రూ.350లు తప్పనిసరిగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కొలతలతో సంబంధం లేకుండా రూ.700 వేతనం ఇవ్వాలని కోరారు. పని ప్రదేశంలో కూలీలకు సౌకర్యాలు అందడం లేదని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పనిముట్లు, మెడికల్ కిట్లు వంటి సౌకర్యాల కల్పన తదితర డిమాండ్ల కోసం ఈ నెల 30న చేపట్టే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.