మహబూబ్ నగర్ కలెక్టరేట్ : అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు ( PAK Terrorists) కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) ఆరోపించారు. కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో న్యాయవాదులు ( Advocates ) చేపట్టిన ర్యాలీకి ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు.
పాకిస్థాన్ ఉగ్రవాదులు భారతదేశంలో కులమతాల మధ్యన చిచ్చు పెట్టి దేశం లో అల్లర్లు సృష్టించేందుకు పన్నాగం పన్నారన్నారు. భారత ప్రభుత్వం , దేశ సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయాలకు అతీతంగా, పార్టీ భావ జాలాలకు అతీతంగా ఏకతాటి మీద ఉండి, అండగా ఉండాల్సిన సమయమని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే కశ్మీర్లో ( Kashmir ) పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ సందర్శకులతో కశ్మీర్ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు.
అక్కడ వారి జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, పాఠశాలలు కూడా అభివృద్ధి చేసుకుంటూ కులమతాలకు అతీతంగా సంతోషంగా జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, గుండా మనోహర్, వీరబ్రహ్మచారి, రమాకాంత్ గౌడ్, మురళి కృష్ణ, లక్ష్మయ్య, కృష్ణయ్య, అనంతచారి, శ్రీపాదరావు, విక్రం గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.