హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసగించేందుకు కాంగ్రెస్ సర్కారు రంగం సిద్ధంచేస్తున్నట్టు తెలిసింది. నిన్న మొన్నటివరకు బీసీలకు రాజ్యాంగబద్ధంగానే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) ద్వారానే ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 14వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ నెల 10న గానీ, 13న గానీ ఉత్తర్వులు జారీ చేసి ఆ మరుసటి రోజే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధంచేసినట్టు సమాచారం. జీవోపై కోర్టులకు వెళ్లకుండా శని, ఆదివారాల్లో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అనంతరం ఈ నెల 15న కామారెడ్డిలో రాహుల్‌గాంధీ సమక్షంలో బీసీల విజయభేరీ సభ నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిందనే అంశాన్ని ఈ సభ ద్వారా ప్రచారం చేయాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పించాలంటే సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ ప్రకారం ఇది సాధ్యం కాదు. ఒకవేళ ఇలా చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. కానీ, ఢిల్లీలో చేయాల్సిన పనులను చేయకుండా కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రంలో హడావుడి చేసి బిల్లుల పేరిట డ్రామాలు ఆడిందనే విమర్శలున్నాయి. ఇక ఇప్పుడు కొత్తగా జీవో పేరుతో మరో నాటకానికి తెరతీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీచేయడం తప్పనే విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియంది కాదు. అదేవిధంగా ఒకవేళ ఉత్తర్వులు జారీచేసినా.. అవి కోర్టుల్లో నిలబడవని, కొట్టివేస్తాయనే విషయం కూడా తెలుసు. అయినప్పటికీ, బీసీలను మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం డ్రామాలపై డ్రామాలు ఆడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. అమలుకు యోగ్యం కాని చర్యలు తీసుకుంటూ.. బీసీలకు ఏదో మేలు చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 15న కామారెడ్డిలో బీసీల విజయోత్సవ సభ నిర్వహించాలని కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఏం సాధించారని బీసీల విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారంటూ బీసీలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారా? పోనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగుమం చేశారా? ఇవేవీ చేయకుండానే విజయోత్సవ సభ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా ఎవరైనా కోర్టుకు వెళ్తే, కొట్టివేసే జీవోతో తమను మభ్యపెట్టాలని చూస్తున్నారా? అని నిలదీస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించిన తరువాతే విజయోత్సవ సభ నిర్వహించాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తే లేదని చెప్తున్నారు.