బాలారిష్టాలు దాటని హస్తం పార్టీ !
అందరూ అనుకున్నట్లు వ్యవస్థలను వాడుకోవడం ద్వారానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నది అనే మాట పూర్తిగా నిజంకాదు. అందులో అర్ధ సత్యమే ఉన్నది. ఎందుకంటే..కేంద్రంలో కాస్తా అటూఇటుగా 70 ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌లో పేరుకు పోయిన అధికారదాహం ఛాయలు ఇంకా ఆ పార్టీని వీడడం లేదు. ఫలితంగా ప్రతిపక్ష పాత్రలో రాణించలేక బొక్కబోర్లా పడుతున్నది. ప్రతిపక్షంగా ఇంకా బాలారిష్టాలు కూడా దాటడం లేదు.
పార్లమెంటులో అత్యధిక సీట్లు కలిగిన కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పక్షాలను ఐక్యం చేయడంలో, నడిపించడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సంస్థాగతంగా కూడా ఆ పార్టీ వృద్ధాప్యపు ఛాయల నుంచి బయటపడలేక పోతున్నది. సంస్థాగతంగా కొత్తతరాన్ని జీర్ణించుకోలేక, పాతతరాన్ని వదిలించుకోలేక ఒకవిధమైన అనిశ్చిత రాజకీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. కాంగ్రెస్ సైద్ధాంతిక ఆచరణ కూడా అంత స్పష్టంగా లేదు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ కేవలం 36.56 శాతం ఓట్లతోనే 240 పార్లమెంటు సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. ఇందుకు కారణం కాంగ్రెస్ శల్య సారథ్యం, స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉన్నది. 74 శాతం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటువేసినా ప్రతిపక్షాల్లో అనైక్యత వలన ఓట్లు వచ్చినా సీట్లు రాలేదు.
2024 పార్లమెంటు ఎన్నికల ముందే ఇండియా కూటమి ఏర్పాటు జరిగింది. సమయం, సందర్భంలో తేడా లేనప్పటికీ కూటమిలో పెద్దన్న పాత్ర నిర్వహించిన కాంగ్రెస్ తమ
కూటమి భాగస్వాములనే అనుమానంగా చూసింది. బీహార్‌కు చెందిన నితీశ్ కుమార్‌ను కూటమిలో ఇముడ్చుకోవడంలో కాంగ్రెస్ వైఫల్యం బీజేపీకి కలిసొచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్‌ను దూరం చేసుకున్న కాంగ్రెస్ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబును దగ్గర చేసుకోలేక ఆ రాష్ట్ర రాజకీయాల్లో రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది. తెలంగాణలో అధికారపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న మరో ప్రాంతీయ పార్టీ పట్ల పూర్తి శతృత్వభావంతో వ్యవహరించడం వలన బీజేపీ వ్యతిరేకపక్షమైన బీఆర్ఎస్తో దూరం పెంచుకుంటున్నది. ఇక తమిళనాడులో కూడా కాంగ్రెస్ అనుసరించిన విధానం పక్వత లేని రాజకీయ పరిణతికి నిదర్శనం. బీజేపీ కుట్రలను ఎదిరించడానికి ఆ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకొచ్చిన విజయ్ను సమర్థించడం కరెక్టే కావచ్చు.
కానీ అది అధికారం ఉన్నా లేకపోయినా సుదీర్ఘకాలం కాంగ్రెస్‌తో సైద్ధాంతిక నిబద్ధతతో అంటి పెట్టుకొని ఉన్న డీఎంకేను, దాని అధినేత స్టాలిన్‌ను బయటకు పోయేలా చేయడం జాతీయ రాజకీయ ప్రయోజనాల రీత్యా కరెక్ట్ కాదు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో కూడామహా ఆఘాడీ కూటమి కట్టి ఆగం ఆగమయ్యింది కాంగ్రెస్. అయినప్పటికీ అక్కడ ప్రజల విశ్వాసం పొందలేకపోయింది. కేరళలో కూడా సీపీఎం నేత పినరయి విజయన్ విషయంలో బీజేపీ జరిపిన దాడిని పరోక్షంగా కాంగ్రెస్ సమర్థించింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సంస్థాగతంగా కుదురుకున్న జాడలు కనిపించడంలేదు. హర్యానా ఎన్నికల్లో కేజ్రీవాల్ అడిగిన నాలుగైదు అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి నిరాకరించడం వల్ల ఎక్కువ స్థానాల్లో చాలా తక్కువ ఓట్లతో కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిన ఓట్ల శాతం కంటే ఎక్కువ ఓట్లు ఆప్ పార్టీకి వచ్చాయి. దాని ప్రభావం ఢిల్లీ ఎన్నికలపై పడింది.
ఇక బెంగాల్లో బీజేపీకి ఎదురొడ్డి పోరాడిన మమతా బెనర్జీకి ఇండియా కూటమి నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం పోటాపోటీతో ఓట్ల్ల చీలిక పరోక్షంగా బీజేపీ గెలుపునకు తోడ్పడ్డాయి. గుజరాత్లో కూడా ఆప్, కాంగ్రెస్ సీట్లు సర్దుబాట్లు జరిగి ఉంటే ఫలితాలు మరోరకంగా ఉండేవి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు కాంగ్రెస్ తాజాగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ చైర్మన్ జ్ఞానేశ్ కుమార్‌ను రాజీనామా కోరుతూ దిగువ స్థాయి నుంచి ఉద్యమానికి పిలుపునిచ్చింది. వాస్తవంగా ఈ పని నాలుగేండ్ల ముందు చేసి ఉంటే కేంద్రంలో ఇప్పుడు బీజేపీకి బదులు అధికారంలో ఉండేది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న ఆ పార్టీ నేతల ఆకాంక్ష మాటలతో నెరవేరదు. చేతలు మాత్రమే సంకల్పానికి సరైన దర్పణం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఎన్.తిర్మల్ : 9441864514
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

