కాంగ్రెస్‌కు చెంపపెట్టు
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉద్యోగులను నమ్మించి మోసం చేసేందుకు వేసిన ఎత్తుల్లో, పన్నిన పన్నాగాల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో విజయానికి ప్రతీకగా మారిన బాణం గుర్తును తాను సమర్థించే ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు ఇప్పించుకుని గెలుపును ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని చూసింది. తనకు అనుకూలంగా లేని ఎంప్లాయీస్ యూనియన్ కూటమి (ఈయూ)ను ఓడించేందుకు ఆఖరి నిమిషం దాకా వేసిన పాచికలేవీ పారలేదు.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఉద్యోగులను నమ్మించి మోసం చేసేందుకు వేసిన ఎత్తుల్లో, పన్నిన పన్నాగాల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బొక్కబోర్లా పడింది. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో విజయానికి ప్రతీకగా మారిన బాణం గుర్తును తాను సమర్థించే ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు ఇప్పించుకుని గెలుపును ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని చూసింది. తనకు అనుకూలంగా లేని ఎంప్లాయీస్ యూనియన్ కూటమి (ఈయూ)ను ఓడించేందుకు ఆఖరి నిమిషం దాకా వేసిన పాచికలేవీ పారలేదు. చివరికి రీజియన్ ఫలితాల లెక్కలను తారుమారు చేసి చూపేందుకూ ప్రయత్నించింది. తాను మద్దతిచ్చిన కూటమిదే ఆధిక్యత అని చాటేందుకు బ్యాలెట్ గుర్తుల కేటాయింపు దగ్గర నుంచి రీజియన్ ఫలితాలను తిమ్మిని బమ్మిని చేయడం వరకు అన్నిరకాలుగా అడ్డదార్లు తొక్కినప్పటికీ అధికార పక్షానికి అంతిమంగా పరాభవమే మిగిలింది. మొత్తం పోలైన ఓట్లు 34,421 కాగా, ఈయూ 18,276 ఓట్లు దక్కించుకుని విజేతగా నిలిచింది. కాంగ్రెస్ సమర్థన పొందిన టీడబ్ల్యూయూ 13,556 ఓట్లతో పరాజయం పాలైంది. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలిచాయి. కుట్రలు, కుహకాలతో విజయాన్ని సొంతం చేసుకోవడం కుదరదని పాలకపక్షానికి స్పష్టమైన సంకేతాలిచ్చాయి. అన్నిరకాల విపరీతపు ఎత్తుగడలను ఎదుర్కొని విజయాన్ని దక్కించుకున్న ఈయూ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కార్మికులు తన మీద ఉంచిన నమ్మకం వమ్ముకాకుండా ఉండాలంటే దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలి.
కొన్ని ఇతర ఉద్యోగ సంఘాల తరహాలో రాజీ పడకుండా పూర్తి నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. కార్మికుల డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం అత్యంత కీలకమైంది. మొన్నటిదాకా విలీనానికి ఎన్నికలతో ముడిపెట్టింది సర్కార్. ఎన్నికైన నేతలతోనే విలీన కమిటీ వేస్తామని ప్రకటించింది. తనకు అనుకూలమైన యూనియన్ను గెలిపించుకుని విలీనంపై తాత్సారం చేయాలనేది బహుశా ప్రభుత్వం ఆలోచనై ఉంటుంది. ఇప్పుడా అడ్డంకి తొలగిపోయింది కనుక తక్షణమే విలీన ప్రక్రియ ప్రారంభించాలని సర్కార్‌పై ఈయూ ఒత్తిడి తేవాలి. ఇంకా 2025లో సవరించిన వేతన స్కేళ్లను అమలు చేయాల్సి ఉన్నది. బకాయిలు రూ.1,500 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై ప్రభుత్వంతో తక్షణమే చర్చలు ప్రారంభించి ఓ కొలిక్కి తేవాలి. సిబ్బందిపై పనిభారం తగ్గించేందుకు అవసరమైన ఉపశమన చర్యలు చేపట్టడమూ తప్పనిసరి.
ఎన్నికల ముందు కాంగ్రెస్ అన్నివర్గాల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగులకు అరచేతిలో స్వర్గాన్ని చూపింది. తక్షణమే విలీనం జరిపి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన స్కేళ్లు, వైద్యం, ఇతర బెనిఫిట్లు అందజేస్తామని నమ్మబలికింది. భారం తగ్గించకపోగా ఉచిత బస్సు ప్రయాణం పేరిట ఆర్టీసీపై అదనపు భారం మోపుతున్నది. ఆ పథకం తాలూకు బకాయిలు చెల్లిస్తే సంస్థ కొంతైనా ఉపశమనం పొందుతుంది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ సకాలంలో చెల్లించే వెసులుబాటు ఏర్పడుతుంది. మరోవైపు ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు, దశలవారీగా ప్రైవేటీకరించేందుకు సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఖాళీల భర్తీ లేకపోవడంతో ఉద్యోగులపై పనిభారం పెరుగుతున్నది. దీనివల్ల వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతున్నది. ఎన్నికల కసరత్తు పూర్తయింది కనుక ఇటు ప్రభుత్వం, అటు ఎంప్లాయీస్ యూనియన్ హామీల అమలుకు, సమస్యల పరిష్కారానికి విభేదాలను పక్కన పెట్టి వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

