బంజారాహిల్స్, సెప్టెంబర్ 8/నమస్తే తెలంగాణ, నెట్వర్క్: ‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు కోరుకుంటున్నామంటూ కాంగ్రెస్ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ఆయనపై కచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శంకర్‌పై మంగళవారం ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ఠాణాల్లో ఎమ్మెల్యే శంకర్‌పై పలువురు ఫిర్యాదులు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని పేర్కొన్నారు. కేసీఆర్ చావును కోరుకుంటున్నామని, అందుకే వెయ్యి డప్పులు కొట్టిస్తున్నామన్న ఆయన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని మండిపడ్డారు.

ఎమ్మెల్యే శంకర్‌తోపాటు గతంలో పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సైతం ఇదే తరహాలో మాట్లాడారని వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలున్నాయని, అతడిపై బీఎన్ఎస్ 196, 351(3), 352,353, 61 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర కాంగ్రెస్ నేతల పాత్రపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. షా ద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ న గర పరిధిలోని గాంధీనగర్, వారాసిగూడ, చిలకలగూడ, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.