న్యూఢిల్లీ : విద్యా సంస్దల్లో వాతావరణాన్ని కలుషితం చేసేందుకు బజరంగ్ దళ్, ఎస్డీపీఐ, పీఎఫ్ఐలను అనుమతించరాదని కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా కోరారు. విద్యాసంస్ధల్లో హిజబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్ధించిన నేపధ్యంలో సుర్జీవాలా ఈ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో విద్య, శాంతిభద్రతల పరిస్ధితిపై సుర్జీవాలా ఆందోళన వ్యక్తం చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వుల నేపధ్యంలో బాలికల విద్యకు విఘాతం కలగకుండా విద్యాసంస్ధల్లో శాంతి, సామరస్యం నెలకొనేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత బొమ్మై ప్రభుత్వంపై ఉందని సుర్జీవాలా పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉందని, తీర్పు కోసం వేచిచూడాలని అన్నారు. రాజకీయ తొట్రుపాటుతో విద్యార్ధులకు శాస్త్రీయ, సాంకేతిక విద్యను దూరం చేయడం సరికాదని అన్నారు.
రాష్ట్రాన్ని మతపరంగా విభజించాలనే బీజేపీ అజెండా కోసం శాంతియుత వాతావరణం, మత సహనంతో రాజీపడాల్సిన అవసరం లేదని సుర్జీవాలా ట్వీట్ చేశారు. మతంతో నిమిత్తం లేకుండా బాలికలు స్కూళ్లు, కాలేజీలకు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.