హైదరాబాద్ : తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ పౌరులను వలసల పాలుచేసి, ప్రజలను వంచించింది కాంగ్రెస్ . తెలంగాణ అమరుల ఉసురు తగిలే కాంగ్రెస్ పార్టీ అంతర్ధానమవుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. బీజేపీని ఎదుర్కోవడం చేతగాక కాంగ్రెస్ చేతులు ముడుచుకుని కూర్చున్నదని విమర్శించారు.
నిర్మాణాత్మక ప్రతిపక్షం లేక నేడు దేశంలో బీజేపీ ఆడింది ఆట పాడింది పాటగా మారింది. తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని, బీజేపీని కాంగ్రెస్, రాహుల్ గాంధీ పార్లమెంటు బయటా, లోపలా ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. ఎవరికి భయపడి రాహుల్ గాంధీ ప్రశ్నించడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపుకోసం బీజేపీకన్నా ఎక్కువగా కాంగ్రెస్ ఆరాటపడుతుందని ఎద్దేవా చేశారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక, హుజూరాబాద్ శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో ఈ విషయం స్పష్టమయింది. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. గత ఏడేళ్లుగా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వివిధ రంగాలలో అందుతున్న అవార్డులే దీనికి సాక్ష్యం అన్నారు.
ధాన్యం కొనలేక కేంద్రం చేతులు ఎత్తేస్తే .. తెలంగాణ రైతాంగం శ్రేయస్సు దృష్ట్యా కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు ముందుకువచ్చారని మంత్రి గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యవసాయరంగా పట్ల ఒక విధానం, ప్రణాళిక లేదని పేర్కొన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ మోసాలకు విసిగి ప్రజలు ఇటీవల ఎన్నికలలో నేలకేసి కొట్టారు. 2004 నుంచి 2019 వరకు అమేథి పార్లమెంట్ స్థానం నుంచి రాహుల్ గాంధీకి ఎంపీగా ప్రజలు అవకాశం ఇస్తే నిర్లక్ష్యం చేశారు.
2019లో ప్రజలు అమేథిలో ఓడించి రాహుల్ ను తరిమికొట్టారన్నారు. గాంధీ కుటుంబ వారసత్వమే రాహుల్ కు ఉన్న అర్హత. ఐదోతరం వ్యక్తిగా కాంగ్రెస్లో ఉన్న రాహుల్ కుటుంబపాలన, వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. వరంగల్ సభలో ఇచ్చిన హామీలను, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలుచేసి రాహుల్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.