శంకరపట్నం, జూన్ 23 : రాష్ట్రంలో సాగునీటి వనరులపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది. ప్రాజెక్టులపై చిన్నచూపు చూస్తుండడంతో ఎవుసం ఆగమైపోతున్నది. శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టు గండిపడి రెండేండ్లయినా మరమ్మతులు చేయించకపోవడం వివక్షకు అద్దం పడుతున్నది. శంకరపట్నం, వీణవంక మండలాల్లో దాదాపు 1200 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ మినీ జలాశయం మత్తడికి 2023లో గండిపడింది. రింగ్‌బండ్ ద్వారా తాత్కాలిక మరమ్మతులు చేసినా గతేడాది మరోసారి గండి పడి చుక్క నీరు లేకుండా పోయింది.
ఈ క్రమంలో రైతులే స్వయంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక బస్తాలు తెచ్చి అడ్డుగా వేసి తాత్కాలికంగా బాగు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ యేడు సాగు ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టి మినీ ఎల్ఎండీగా మార్చేందుకు కసరత్తు జరుగుతుండగానే, ప్రభుత్వం మారడం శాపంగా మారింది.
ప్రస్తుతం వానకాలం సీజన్ వచ్చినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడం, బాగు చేయకపోవడంతో వరద నీరు వృథాగా పోతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పునరుద్ధరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు ఖాళీ కావడంతో కొందరు శిఖంలో పాగా వేస్తున్నారని మండిపడుతున్నారు. ఇష్టారీతిన ట్రాక్టర్లతో చదును చేస్తూ అక్రమంగా సాగు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.