Vemulawada | వేములవాడ, జూన్ 23 : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ధాన్యం కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులదే ప్రధాన పాత్ర ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆరోపించారు. మంగళవారం వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కుంభకోణంలో ఇప్పటివరకు బయటపడింది రవ్వ అంతే అని లోతైన విచారణ జరిపితే పెద్ద ఎత్తున అవినీతి గుట్టలు బయటపడతాయన్నారు. సాక్షాత్తు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామంలో ఆయన ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వామి అలియాస్ గడ్డం నర్సారెడ్డి నకిలీ ట్రక్ షీట్లతో రెండు లారీల ధాన్యం అమ్మినట్లు పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారని గుర్తు చేశారు. రుద్రంగి ధాన్యం, మక్కల కొనుగోలు వ్యవహారంలో లోతైన విచారణ జరిపితే పెద్ద ఎత్తున ధాన్యంతో పాటు మక్కలు కూడా ఇదే తరహాలో నకిలీ పత్రాలు సృష్టించి అమ్మినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు.
స్వామి ఆదికి ముఖ్య అనుచరుడు కావడంతోనే రుద్రంగిలో డీసీఎంఎస్ ద్వారా ప్రత్యేక ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఆ బాధ్యతలు అప్పగించారని అన్నారు. నియోజకవర్గ కేంద్రం వేములవాడలో కాకుండా రుద్రంగిలో మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడమే ఆయనకు సన్నిహితుడనే విషయం బహిర్గతమైందన్నారు. మల్కపేట శ్రీనివాస్, రుద్రంగి స్వామి అలియాస్ నర్సారెడ్డి కాంగ్రెస్ అనుచరులు అనడానికి ఇదిగో సాక్ష్యం అంటూ ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న చిత్రాలు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను చూపుతూ బహిర్గతం చేశారు. దొంగలు దొరికాక ఇప్పుడు తమ వాళ్లు కాదని మీడియా సమావేశాలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు, బీసీ బిడ్డ ఎదుగుతే చూడలేక ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారని అన్నారు.
ఆది శ్రీనివాస్ బీసీ బిడ్డగా మంత్రి పదవి వస్తే పూర్తి స్థాయిలో స్వాగతి ఇచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కూడా పాటుపడతాడని నమ్మకం ఉందని, కానీ అవినీతి జరిగినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తామని చెప్పారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనడానికి రాని చేతులు, కోట్లాది రూపాయల కుంభకోణాలకు ముందుకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల్లో అవినీతి అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. అవినీతి కుంభకోణం బయటికి రావడంతో ధాన్యం విక్రయించిన జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారని వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, సీఎంకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఈ సంఘటనలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయించి రైతులకు తెలపాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉందని అన్నారు. గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్లుగా కాంగ్రెస్ నాయకుల పనితీరు ఉందని ఎద్దేవా చేశారు.
కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం..
వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సామాజిక మాధ్యమాల్లో పెడితే కార్యకర్తలను అర్ధరాత్రి కూడా అని చూడకుండా పోలీసులు వేధిస్తున్నారని ఆమె అన్నారు. చందుర్తి మండలంలోని బండపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ ను దివ్యాంగుడు కూడా అని కూడా చూడకుండా రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోం అని హెచ్చరించారు. బీఆర్ఎస్ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, తమ పార్టీ నాయకులపై కూడా ఇష్టానుసారంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు కాంగ్రెస్ నాయకులు పెడుతున్న తీరు పోలీసులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ తప్పనిసరిగా అన్ని చూస్తున్నామని పోలీసులు కూడా సమన్వయం పాటించకుండా కక్ష సాధింపులకు దిగితే తప్పనిసరిగా సమాధానం చెబుతామని అన్నారు.
వడ్లు తరలించిన లారీలోనే దొంగతనంగా మల్కపేటకు బస్తాలు వచ్చాయి : రామ్మోహన్ రావు, సింగిల్ విండో చైర్మన్ (కొలనూరు)
రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసి గోదాముకు పంపిన లారీలోనే దొంగతనంగా మల్కపేటకు ధాన్యం బస్తాలు వచ్చాయని కొలనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు అన్నారు. ధర్మారం ,కొలనూరు నుంచి పంపిన లారీ నెంబర్ TS 05 UA 5999లో 815 బస్తాల ధాన్యం తరలించామని తెలిపారు. ఇదే లారీలో మల్కాపేటకు దొంగతనంగా 89 బస్తాలు ధాన్యం వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారని తెలిపారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని మాట్లాడిన నాయకులను ప్రశ్నిస్తూ ఇదిగో ఆది శ్రీనివాస్‌తో ఉన్న చిత్రాలను చూపుతూ గత పత్రికలలో వచ్చిన వార్త కథనాలను కూడా చూపుతూ ప్రశ్నించారు. అయితే ఇప్పటికే పలు గ్రామాల్లో తూకం వేసిన ధాన్యం సంబంధించిన లారీల ట్రక్ షీట్లు తిరిగి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అసలు లారీలు ఉన్నాయా..? మాయమైనాయా..? అనే విషయాన్ని నిర్ధారించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సహకార సంఘం కొనుగోలు కేంద్రం ఉండగానే డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది ఇందుకేనా..? : కిషన్ రావు, సింగిల్ విండో చైర్మన్ (సనుగుల)
రుద్రంగి మార్కెట్ కమిటీలో సహకార సంఘం తరఫున కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు సేవలందిస్తుండగా ఇటీవలే డీసీఎంఎస్ ద్వారా మరో కొనుగోలు కేంద్రాన్ని ఆది శ్రీనివాస్ ఏర్పాటు చేయించారని సింగిల్ విండో చైర్మన్ కిషన్ రావు అన్నారు. రైతుల కోసం మరో కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా చాలా ఉపయోగంగా ఉంటుందని అనుకున్నాం కానీ అక్రమాలు చేసేందుకే ఇంకో కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఇప్పుడే తెలిసిందని విమర్శించారు. నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన మొక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఆయన అనుచరుడు స్వామి కోసమే అది కూడా రుద్రంగిలోనే ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు కుంభకోణం బయటపడిన తర్వాత ఆ వ్యక్తికి వారికి సంబంధం లేదని మాట్లాడుతున్న తీరు ఇదిగో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో స్వామి ఉన్న చిత్రాలను చూపుతూ మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు జలగం కిషన్ రావు, రామ్మోహన్ రావు, తిప్పని శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, సీనియర్ నాయకులు గడ్డం హన్మండ్లు, గోస్కుల రవి, డప్పుల అశోక్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, చంద్రయ్య గౌడ్, పట్టణ మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, గోలి మహేశ్, మండల నాయకులు జంకె శ్రీనివాస్ రెడ్డి, పసుల అంజి, సర్పంచ్ శరత్, అరవింద్, ఉప సర్పంచ్ బాబు, నాయకులు మహేందర్, జవ్వాజి దేవయ్య, పట్టణ నాయకులు సుంకపాక రాజు, కనకయ్య, మంత సందీప్, జంగిటి సంజీవ్, ప్రేమ్ చారి, దేవరాజు, అశోక్, పబ్బ మహేష్, నాగుల రాము, దమ్మ భాస్కర్, మిరియాల సంతోష్, అల్లాడి రమేష్, తదితరులు పాల్గొన్నారు.