ఆత్మకూర్ : మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి (Maktal MLA Srihari ) మంత్రి పదవి ఖాయం కావడంతో ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సోషల్ మీడియాలో, కరపత్రాలతో లేనిపోని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ( Police Station) ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఆత్మకూర్ మండల మాజీ అధ్యక్షుడు రహమతుల్లా, పట్టణ అధ్యక్షుడు నల్లగొండ శ్రీనివాసులు, ఆత్మకూర్ మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్ మాట్లాడారు. నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేగా గెలవడం, అలాగే అధిష్టానం నుంచి మంత్రి పదవి లభస్తుందని తెలియడంతో శ్రీహరికి మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీపై, కొంతమంది నాయకుల మీద వాకిటి శ్రీహరి చేసినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో, కరపత్రాలను ముద్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటివారిని పోలీసులు గుర్తించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకట నరసింహ రావు, మణి వర్ధన్ రెడ్డి, దామోదర్ ఉన్నారు.