Rakesh Reddy | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ లీడర్ ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ శాస్త్రీ నగర్లో నిరుద్యోగ జేఏసీ నేతలపై దాడి హేయమైన చర్య అని పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు.
ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ఆ నిరుద్యోగ యువత పైనే దాడి చేయడం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను బొంకి, బొర్లించి ఎన్నికలు అయిపోగానే బోల్తా కొట్టారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ ఇలా నోటికొచ్చిన హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మావల్ల మీకు ఉద్యోగాలు వచ్చాయి. మరి, మా ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నిస్తే, ఇన్నాళ్లు అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకే తెగబడుతున్నారు. అందుకే అనేది, ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన, పైశాచిక పాలన అని అంటున్నామని రాకేశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమి లేక, అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులనే నమ్ముకున్నారు. ఆఖరికి అభ్యర్థి సైతం బాధ్యత మరిచి ఉరికించి కొడతాం. రోడ్ల మీద తిరగనీయం అని బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్నం పెట్టినోళ్ళకు సున్నం పెట్టడం వెన్నతో పెట్టిన విద్య. నాడు మార్పు పేరుతో మీ గెలుపు కృషి చేసిన చేతులకే నేడు మీరు సంకెళ్ళు వేస్తున్నారు. రేపు అవే గొంతులు ఏకమై మీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాయి. అభివృద్ధి చేయలేకనే ఈ అసహనం. అరాచకాలతో, దారులతో, హింసతో అధికారాన్ని కొనసాగించలేరు. జూబ్లిహిల్స్ దెబ్బతోనే మీ పతనం ఖాయం. ఈ రోజు మీరు దాడి చేసిన ఆ నిరుద్యోగ యువతే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ ను బొందపెట్టి విజయోత్సవ ర్యాలీ చేస్తారు అని ఏనుగుల రాకేశ్ రెడ్డి హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ జేఏసీ మహిళల మీద దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు pic.twitter.com/m1shdFs4Gb
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2025