పాట్నా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) బీహారీల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. తెలంగాణ (Telangana) ప్రజల డీఎన్ఏ కన్నా బీహార్ (Bihar) ప్రజల డీఎన్ఏ (DNA) నాసిరకమని రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఆయన మాటతీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం బీహార్ కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ న్యూస్ 24 మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బీహార్ ప్రజల డీఎన్ఏ గురించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని కోరినపుడు కన్హయ్య ఘాటుగా మాట్లాడారు. రేవంత్‌ను దొంగ, మూర్ఖుడు, మర్యాద లేనివాడు అంటూ విరుచుకుపడ్డారు.
దొంగతనం చేసేవారిని దొంగలని అంటామని, మర్యాద లేకుండా మాట్లాడేవారిని మూర్ఖుడు అని అంటామని, అలాంటివారు ఎక్కడివారైనా, ఎక్కడి నుంచి ఊడిపడి వచ్చినా, తమ పార్టీలోని వారైనా తాను కూడా అలాగే చెబుతానని, భయపడేది లేదని స్పష్టం చేశారు. మాజీ ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఇటీవల రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయే శాసన సభ ఎన్నికల్లో రేవంత్‌ను ఓడించి తీరుతానని చెప్పారు.
కనీస మర్యాద లేకుండా, సయంమనం పాటించకుండా వివిధ రాష్ర్టాల్లో కీలకమైన కార్మిక శక్తిగా ఉన్న బీహారీలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన ఉన్నత పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు ఓ రాష్ట్ర ప్రజలను, వారి కార్మిక శక్తిని కించపరిచేలా మాట్లాడటాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు.
రేవంత్ రెడ్డి గౌరవంగా మాట్లాడటం నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. మరోవైపు ఆయన చేసిన ఈ చౌకబారు వ్యాఖ్యలు బీహార్ శాసన సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి శాపంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యల విషయంలో బీజేపీ, జన సురాజ్ పార్టీలు రేవంత్‌ను తీవ్రంగా ఎండగడుతున్నాయి. శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను తీవ్రంగా తప్పుపడుతున్నారు.