హైదరాబాద్, అక్టోబర్4(నమస్తే తెలంగాణ): అధికారం తమదేనన్న భావనతో కాంగ్రెస్ నేతలు చట్టాన్నే తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక మునుపే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అన్నింటా అజమాయిషీని ప్రదర్శిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ టికెట్ ఆశిస్తున్న నవీన్‌యాదవ్ (Naveen Yadav) ఏకంగా చట్టవిరుద్ధ కార్యక్రమానికే దిగారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధలకు విరుద్ధంగా నకిలీ ఓటరు ఐడీకార్డులను పంపిణీచేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల యూసఫ్‌గూడలోని తన కార్యాలయంలో స్థానిక బస్తీవాసులకు ఓటర్ ఐడీ కార్డుల పంపిణీ అంటూ కార్యక్రమం నిర్వహించారు.
ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్న పైరసీ ఓటరు కార్డులను ఆయన పంపిణీ చేసినట్టు ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, సెక్షన్ 28 ప్రకారం ఓటరుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా ఎలక్టోరల్ ఫొటో గుర్తింపు కార్డు (ఈపీఐసీ)ను కేంద్ర ఎన్నికల సంఘమే నేరుగా పంపిణీ చేస్తుందని ఎన్నికల సంఘం అధికారులు తేల్చిచెప్పారు. ఈ గుర్తింపు కార్డులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారి ఆమోదించిన, అధికారికంగా అనుమతి పొందిన ఏజెన్సీలే ముద్రిస్తాయని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. అటువంటి ఎలక్టరోల్ ఫొటో గుర్తింపు కార్డులకే చట్టబద్ధత ఉంటుందని అధికారులు స్పష్టంచేశారు.
గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
కొందరు రాజకీయ నాయకులు నకిలీ, పోలి ఉండే కార్డులను అనధికార ఏజెన్సీల నుంచి మోసపూరితంగా కొనుగోలు చేస్తున్నారని, వాటిని ఎన్నికల సంఘం ఇచ్చిన గుర్తింపు కార్డులంటూ పంపిణీ చేస్తున్నారని 2020లో కర్ణాటక ఎన్నికల సంఘం తొలుత గుర్తించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రైవేట్ సంస్థల నుంచి పైరసీ ఫొటో గుర్తింపు కార్డులను పంపిణీ చేసే వ్యక్తులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలను జారీచేసింది. ఈ ఆదేశాలను అనుసరించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 సెప్టెంబర్ 24న జిల్లాల కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేత నవీవ్ యాదవ్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వ్యక్తిగత ఓటరు ఫొటో గుర్తింపు కార్డులను పంపిణీ చేసి దాదాపు ఐదు రోజులు దాటినా.. ఇప్పటివరకు ఎన్నికల అధికారలు స్పందించక పోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.