హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బంజారాహిల్స్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): క్రికెట్ ప్రస్థానంలో ఓ క్రీడాకారుడిగా ఎన్నో క్లిష్టమైన బంతులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఓ కెప్టెన్‌గా ప్రత్యర్థుల పాచికలను చిత్తుచేసి జట్టును విజయతీరానికి నడిపారు. కానీ ఇప్పుడు రాజకీయ చదరంగంలో మాత్రం సొంత పార్టీ (Congress)లోని ప్రత్యర్థులు వేసే యార్కర్లను ఆడటంలో తడబడుతున్నారు. బంతిని సరిగా అంచనా వే యలేక క్రీజ్ నుంచి తప్పుకునేందుకూ సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడిప్పుడే ప్రత్యర్థుల వ్యూహం అర్థమవుతున్నట్టుంది! శ్రేయోభిలాషులు, అనుచరులు, అభిమానులు ఇచ్చే సూ చనలతో అసలు తత్వం బోధపడుతున్నట్టుంది. అందుకే క్రీజ్‌ను వదలాలా?వద్దా?? అని అంతర్మథనంలో పడిపోయారు.
అంటే తాను బరి నుంచి తప్పుకోవడంపై ‘డెసిషన్ పెండింగ్’ బోర్డు పెట్టేశారు. ఇదీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిపై మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ (Azharuddin) అంతర్మథనం చెందుతున్న తీరు. ప్రధానంగా సీఎం వర్గం తనను బలిపశువును చేస్తున్నదా? అనే సం దేహం అజార్‌ను పట్టి పీడిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే ఉప ఎన్నిక తెరపైకి రాగానే అందరి కంటే ముందుగానే హడావుడి మొదలుపెట్టిన ఆయన.. సీఎం వర్గం ఎమ్మెల్సీ అస్త్రం ప్రయోగించడంతో మిన్నకుండిపోయా రు. కానీ అది అయ్యేది కాదు, పొయ్యేదీ కాదని ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తుండటంతో తిరిగి జూబ్లీహిల్స్ రేస్‌లో ఉండేందుకు పునరాలోచన చేస్తున్నట్టు అజార్ వర్గం చెప్తున్న ది. కొద్దిరోజులుగా మైనార్టీ పెద్దలతో అజారుద్దీన్ సమాలోచనలు చేస్తున్నారు.
వ్యతిరేకంగా సీఎం వర్గం పావులు
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వెంటనే సీఎం వర్గం నియోజకవర్గంపై దృష్టి సారించింది. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ నుంచి గత అసెం బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి 65 వేల ఓట్లు సాధించి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. ఆయన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తనకే మరోసారి పార్టీ అవకాశం ఇస్తుందని బలంగా నమ్మారు. కానీ ముందుగానే రంగంలోకి దిగిన సీఎం వర్గం మాత్రం అజార్‌కు వ్యతిరేకంగా పావులు కదిపింది. హెచ్‌సీఏలో ఆది నుంచి పొసగని ఓ మంత్రి.. సీఎం వర్గంలో ఉండి అజార్‌ను ఎలాగైనా రేస్ నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించినట్టు అప్పట్లోనే అజార్ వర్గం నుంచి ఆగ్రహం వ్యక్తమైంది.
దానిని నిజం చేస్తూ సదరు మంత్రి సీఎం, ఇతర ముఖ్య నేతలతో చక్రం తిప్పినందునే అజార్‌ను తప్పించేందుకు తెరవెనుక ఎమ్మెల్సీ అస్ర్తాన్ని ప్రయోగించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వా న్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ రేస్ నుంచి అజార్‌ను తప్పించేందుకు సీఎం వర్గం దీనిని అనుకూలంగా మలుచుకున్నది. అమీర్ అలీఖాన్‌కు మొండిచెయ్యి చూపి ఆ అవకాశాన్ని అజార్‌కు ఇస్తున్నట్టు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నందున ఎమ్మె ల్సీ వస్తుందనే ఆశతో అజార్ రేస్ నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకున్నారు.
నెలరోజుల తర్వాత అజార్ ఆగమనం
నెలరోజుల క్రితం ఎమ్మెల్సీ ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి అజారుద్దీన్ నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉన్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు అవకాశాన్ని చేజార్చుకుంటే ఎలా? అని అనుయాయులు అజార్‌కు నచ్చజెప్పడంతో గత కొన్నిరోజులుగా మళ్లీ చురుకుగా పాల్గొంటున్నారు. శనివారం మంత్రి పొన్నం కార్యక్రమంలోనూ పాల్గొని రేస్‌లో తాను కూడా ఉన్నాననే సంకేతాన్నిచ్చారు. ఇదంతా చూస్తున్న పార్టీ శ్రేణులు మ్యాచ్ మళ్లీ మొదటికొచ్చిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
పునరాలోచనలో అజారుద్దీన్
పునరాలోచనలో అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఎంపిక అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న దరిమిలా ఎమ్మెల్సీ వచ్చేదా? పొయ్యేదా? అనే చర్చ అజార్ వర్గంలో మొదలైంది. ఆదిలో దీనిని పెద్దగా పట్టించుకోని అజార్.. కొన్నిరోజులుగా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. పార్టీలోని కొందరు ముఖ్య నేతలతోపాటు మైనార్టీ ప్రముఖులు కూడా అజార్‌కు అసలు విష యం అర్థమయ్యేలా చెప్పినట్టు సమాచా రం. ఎమ్మెల్సీ పదవిపై న్యాయపరమైన చిక్కులు ఉండడంతో దానికోసం వేచి చూడడడం వృథా ప్రయాస అని, ఉప ఎ న్నికలో పోటీ చేయడమే మంచిదంటూ అజార్‌కు సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఆశచూపి సీఎం వర్గం రేస్ నుంచి తప్పించేందుకు ఈ పాచిక వేసిందని, ఆ ఎమ్మెల్సీ పదవి వచ్చేది అనుమానమేనని చెప్పడంతో అజార్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది.