తాండూర్ : ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల (Auto Drivers ) శవాలపై డబ్బులు ఏరుకుని తెలంగాణలోని కాంగ్రెస్ ( Congress) ప్రభుత్వం పండుగ చేసుకుంటున్నదని తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండీ హాబీబ్ పాషా( President Habeeb Pasha) ఆరోపించారు. మండల కేంద్రం ఐబీలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రంలోని ఏడు లక్షల పైచిలుకు ఆటో కార్మికులకు మహాలక్ష్మి పథకం గొడ్డలిపెట్టుగా మారిందని వాపోయారు. ఇప్పటివరకు 87 మంది ఆటో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కనీసం పరామర్శించడానికి కూడా రాని ప్రభుత్వ పెద్దలు ఆర్థికంగా నిలదొక్కుకున్న ఆర్టీసీకి అదనంగా 200 కోట్లు వచ్చాయని పండుగ చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
గత ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల ఇస్తామని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 19 నెలల గడిచిపోయిన ఇప్పటివరకు ఆటో కార్మికుల ఊసు ఎత్తకపోగా దయ సమస్యలు విన్నవించుకోవడానికి రవాణా శాఖ మంత్రిని కలిస్తే వ్యంగ్యంగా మాట్లాడడన్నారు.
ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు, చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా గురించి, ఆటో కార్మికులకు రూ.12 వేలు, ఈ మూడు అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చాంద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, కార్యనిర్వాహక సభ్యుడు ఆశుం అలీ, ఆటో కార్మికులు పాల్గొన్నారు.