హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కారు చిల్లర రాజకీయం చేస్తున్నదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. అసలు విభజన చట్టంలో లేని పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు లేనప్పుడు కేంద్రం కమిటీలను ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా కేంద్ర కమిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం సభ్యుల పేర్లను ఎందుకు పంపిందని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు ఏవైనా, వివాదాలేవైనా భారత రాజ్యాంగం ఒకటేనని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా ఏర్పాటుచేస్తున్న సంస్థలను, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిడ్డారు.
పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ప్ర స్తావిస్తూ, ఆంధ్రప్రదేశ్ వాదనలు విచిత్రంగా ఉన్నాయని పొన్నాల విమర్శించారు. ‘తెలంగాణకు హైదరాబాద్ ఉంది కదా.. ఏపీ సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోకూడదా? అని ఏపీ తరపు అడ్వకేట్ ఎలా వాదిస్తారు?’ అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా? అని వాపోయారు. ‘సాగునీటి ప్రాజెక్టులపై ఏం చేయాలో విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నది. ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమలసాగర్ విభజన చట్టంలో ఎకడున్నది? ఆ ప్రాజెక్టుకు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి లేనపుడు కమిటీలు ఎలా వేస్తారు? అసలు మీటింగ్‌కే పోమని చెప్పిన రేవంత్‌రెడ్డి కేంద్ర కమిటీకి ఎలా ఒప్పుకుంటారు? సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ఆ కమిటీ కోసం సభ్యుల పేర్లు ఎందుకు పంపారు?’ అని పొన్నాల ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే ‘కమిటీ వేసుకున్నారు కదా.. కోర్టుకు ఎందుకు వచ్చారు’ అని సుప్రీంకోర్టు తెలంగాణను ప్రశ్నించిందని గుర్తుచేశారు. కృష్ణానది, గోదావరి నదుల మధ్య ఉన్న తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే శరణ్యమని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.