కరీంనగర్ కార్పొరేషన్/ చొప్పదండి, జనవరి 26 : ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ తర్వాత పాలనపై చేతులెత్తుస్తున్నది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నది. ఈ క్రమంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండగా, తప్పించుకునేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నది. ఎక్కడికక్కడ సర్కారు వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా అస్త్రశస్తాలు సంధిస్తున్నది. ఇటీవల సింగరేణి బొగ్గు బ్లాకుల వ్యవహారం ప్రభుత్వంలోని అవినీతిని బట్టబయలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగుతున్నది. ఇప్పటికే ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారమంటూ దానిపై దర్యాప్తునకు ఓ సిట్‌ను ఏర్పాటు చేసి.. పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని వేధింపులకు పాల్పడుతున్నది. ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సిట్ విచారించింది. ఆ తర్వాత మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సిట్ నోటీసులివ్వగా, తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిని నోటీసుల పేరుతో గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలపై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే సిట్ పేరిట డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సర్కారు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని భగ్గుమంటున్నారు.
కాంగ్రెస్ రాష్ట్రంలో అభివృద్ధిని గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతీకార చర్యలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం అందులో భాగమే. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. సిట్ పేరిట పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయ కక్షలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. రేవంత్ తనపై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు, ప్రజల దృష్టి మళ్లించడానికి సిట్ పేరిట బీఆర్ఎస్ నాయకులకు నోటీసులు ఇస్తున్నారు. ఇటువంటి పద్ధతులు మానుకోవాలి. భవిష్యత్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన.. పూర్తిగా పగ ప్రతీకార పాలనగా మారింది. పోలీసులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబాన్ని కమిషన్లు, సిట్ పేరిట వేధించడమే కాంగ్రెస్‌కు ప్రధాన అజెండా అయింది. ఎన్నడూ ప్రభుత్వంలో లేని సంతోష్ కుమార్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట సిట్ నోటీసులు జారీ చేయడం పూర్తిగా కక్ష సాధింపు చర్యే. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సింగరేణి బొగ్గు సాంలో ముఖ్యమంంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ఆయన బంధువులు పీకల్లోతు కూరుకుపోయిన విషయాలు వెలుగులోకి రావడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే సిట్ నోటీసుల పేరిట టీవీ సీరియల్ లాంటి డ్రామాను నడుపుతున్నారు. కక్షసాధింపు రాజకీయాలు చేసే రేవంత్ రెడ్డికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. సంతోష్ కుమార్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ అండగా నిలుస్తుంది.