హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తు న్న తరుణంలో కాంగ్రెస్ సర్కార్ విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకున్నది. చార్జీలు పెంచితే ఓటమి తప్పదని గ్రహించి విరమించుకోగా, మొత్తంగా పురపాలక ఎన్నికల నేపథ్యంలో వినియోగదారులకు ఆర్థిక భారం తప్పింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు చార్జీలు పెంచబోమని, ప్రస్తుత టారిఫ్‌నే ఆమోదించాలని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని ఇప్పటికే డిస్కంలు అభ్యర్థించాయి. 2026- 27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సరఫరా వ్యాపారం కోసం సమగ్ర ఆదాయ ఆవశ్యకత నివేదికలను రెండు డిస్కమ్‌లు ఈఆర్సీకి సమర్పించాయి. ఈ నెల 31 వరకు నివేదికపై అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తారు. మార్చి 5న హనుమకొండలో, మార్చి 7న హైదరాబాద్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో విచారణ జరి పి, టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేస్తే ఆమోదిత టారిఫ్ ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నది.
హైదరాబాద్‌లోని దక్షిణ డిస్కమ్ ఆదాయ ఆవశ్యకత రూ.50,242 కోట్లు కాగా, చార్జీల రూపంలో రూ.40,659 కోట్లు సమకూర్చుకుంటూ రూ.9,583 కోట్లను లోటుగా చూపిస్తున్నది. హనుమకొండ కేంద్రంగా సేవలందిస్తున్న ఉత్తర డిస్కమ్ ఆదాయ ఆవశ్యకత రూ.22,754 కోట్లు కాగా కేవలం రూ.10,233 కోట్ల ఆదాయంతో రూ.12,521 కోట్ల లోటును చూపుతున్నది. రెండు డిస్కమ్‌లు కలిపి రూ.22,104 కోట్ల లోటులో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. రాబడి తక్కువ, వ్యయం ఎక్కువ అన్నట్టుగా తయారైంది ఉత్తర డిస్కమ్ పరిస్థితి.