భీమ్‌గల్, జూన్ 14: పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంపై తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని వంద పడకల దవాఖాన భవనం, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కె ట్ భవన నిర్మాణ పనులు, మూత పడిన బస్ డిపోను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భీమ్‌గల్ చుట్టు పక్కల మండలాల పేదలకు మెరుగైన వైద్యం అందిం చాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్, అప్పటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును ఒప్పించి రూ. 35 కోట్లతో వంద పడకల దవాఖాన మంజూరు చేయించినట్లు తెలిపారు. కేవలం ఏడాదికాలంలోనే తాము అధికారంలో ఉండగా రూ. 16 కోట్లతో 75 శాతం పనులు పూర్తి చేసి కాంట్రాక్టరుకు రూ. 13 కోట్ల బిల్లులు కూడా చెల్లించినట్లు చెప్పారు.
పట్టణంలోని పాత తహసీల్దార్ ఆఫీస్ స్థలంలో రూ. 3 కోట్లతో 108 దుకాణాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని, తమ హయాంలోనే రూ. 2 కోట్లు పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపాలిటీకి శాశ్వత ఆదాయం వచ్చేలాగా అదే ప్రాంగణంలో మెయిన్ రోడ్‌పై మరో రూ. 3 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి, మొత్తం రూ. 7 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బకాయిపడిన రూ. 90 లక్షలు చెల్లించకపోవడంతో రెండున్నరేండ్లుగా పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో భీమ్‌గల్ బస్‌డిపోను ఆధునీకరించి ఆరునెలల పాటు విజయవంతంగా నడిపించామని గుర్తుచేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మూతపడిన బస్‌డిపోను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము భీమ్‌గల్ మున్సిపాలిటీ పరిధిలో మిగిలిపోయిన సీసీ రోడ్ల కోసం రూ. 10 కోట్లు, ఫంక్షన్ హాల్ కోసం రూ. 1.5 కోట్లు, మొత్తంగా రూ. 11.5 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి సీతక్క తో హడావుడిగా కొబ్బరికాయలు కొట్టించి కంకర పోయించి ఆరునెలలవుతున్నా ఆ రోడ్లను పూర్తి చేయలేదన్నారు. బడాభీమ్‌గల్ బ్రిడ్జి, రోడ్డు వరదలకు కొట్టుకుపోయి ఏడాది దాటుతున్నా కనీస మరమ్మతులు చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన బడ్జెట్ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన 25 శాతం పనులను కూడా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఓడినా, గెలిచినా బీఆర్ఎస్ ఎల్లపుడూ ప్రజల పక్షానే ఉంటుందని, వారి కోసమే పోరాడుతుందని వేముల స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొనకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీలు ఆర్మూర్ మహేశ్, చౌట్పల్లి రవి, సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య, నాయకులు బాదావత్ శర్మనాయక్, పసుల ముత్తెన్న, మాణిక్యాల శ్రీనివాస్, కొమ్ము నరేశ్, సూర్జీల్, సర్పంచులు మేస కార్తీక్, డిష్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మూడు నెలల్లో రూ. 5 కోట్లు తెచ్చి దవాఖానను తెరిపిస్తానని అబద్ధపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఫిబ్రవరి14న ఎన్నికల ఫలితాలు వచ్చి ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా మిగితా 25శాతం పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగా మహేశ్‌కుమార్ కూడా మాట తప్పారన్నారు. ఇప్పటికైనా వంద పడకల దవాఖానను పూర్తి చేయడానికి జూలై 14 వరకు మరో నెల రోజుల గడువు ఇస్తున్నామని, ఆలోగా దాన్ని పూర్తి చేయకుంటే భీమ్‌గల్‌లో మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు కాంగ్రెస్ నాయకులను ప్రజలు
తిరగనివ్వబోరని హెచ్చరించారు.