పెద్ద కొడప్గల్, జూలై 21: కాంగ్రెస్ పాలనలో కర్షకులను కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనాలు వేసింది మొదలు పంటలు అమ్ముకునే దాకా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట అమ్మినా డబ్బులు చేతికి రాక అప్పులు పెరిగి పోతున్నాయి. కాలం కరుణించని తరుణంలో ఓవైపు రైతులు సతమతమవుతుంటే, అండగా నిలవాల్సిన సర్కారు సతాయిస్తున్నది. కష్టపడి సాగు చేసిన పంటల డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. గత సీజన్లో రైతుల నుంచి జొన్న కొనుగోళ్లు చేసిన రేవంత్ ప్రభుత్వం పైసలు ఇవ్వకుండా వేధిస్తున్నది. పంట అమ్మి రెండు నెలలు దాటినా ఇప్పటికీ వేలాది రైతులకు డబ్బులు రాలేదు. మరోవైపు, వానాకాలం సాగు ప్రారంభం కావడంతో చేతిలో చిల్లగవ్వ లేకుండా అన్నదాతలు సతమతమవుతున్నారు. అప్పులు తెచ్చి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి, పంటల వేస్తున్నారు.
జొన్నలు కొనుగోలు చేసిన వారం రోజుల వ్యవధిలోనే డబ్బులు ఖాతాలో జమ చేస్తామని అధికారులు మొదట్లో చెప్పారు. కానీ, రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడం, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మండల స్థాయి అధికారులు, సహకార సంఘాల బాధ్యులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆందోళన బాట పట్టేందుకు కర్షకులు సిద్ధమవుతున్నారు. వారం లోపు డబ్బులు రాకపోతే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.
గత సీజన్లో ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొన్నది. చాలా మంది రైతులు అమ్ముకున్న తర్వాత జొన్న కొనుగోళ్లను ప్రారంభించింది. అయితే, కొనుగోలు చేసిన పంటలకు సంబంధించిన డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. ఒక్క పెద్ద కొడప్గల్ మండలంలోనే మార్కెఫెడ్ ఆధ్వర్యంలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 4,482 మంది రైతుల నుంచి 1.11 లక్షల క్వింటాళ్ల జొన్న లు కొనుగోలు చేసింది. 385 మంది రైతులకు సంబంధించి రూ.3.45 కోట్లు బ్యాంకు ఖాతా ల్లో జమయ్యాయి. మిగతా 4,097 మందికి రూ.40.78 కోట్లు రావాల్సి ఉన్నది. రెండు నెలలు గడుస్తున్నా సొమ్ము జమ కాలేదు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామని గొప్పగా చెప్పుకునే ప్రభుత్వం.. జొన్న రైతులకు మాత్రం డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు జమ కాకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
యాసంగిలో పండించిన జొన్న పంటలకు సంబంధించిన డబ్బులను రైతులు వానాకాలం సాగుకు పెట్టుబడిగా పెడుతారు. అయితే, నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఖాతాల్లో డబ్బులు జమ చేయక పోవడంతో కర్షకులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. వానాకాలం పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక చితికి పోతున్నారు. చివరకు పంటల సాగు పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. దళారులను ఆశ్రయించి అధిక వడ్డీకి తీసుకొచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేసి రెండు నెలలై పోయింది. ఇప్పటికీ డబ్బులు రాలేదు. వానాకాలం పంట సాగు కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనడానికి డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రైతుల దుస్థితిని పట్టించుకోవడం లేదు. అధికారులు వెంటనే స్పందించి జొన్న డబ్బులను ఖాతాల్లో జమ చేయాలి.
– హస్రాద్, రైతు, పెద్ద దేవిసింగ్ తండా
జొన్న పంట అమ్ముకుని రెండు నెలలవుతున్నది. ప్రభుత్వం కొనుగోలు చేసిన జొన్న డబ్బులు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. జొన్న సాగు చేసేందుకు గాను తెచ్చిన అప్పులు తీర్చడానికి, వానాకాలం పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అప్పు తేచ్చి పంట సాగు ప్రారంభించాం. అధికారులు స్పందించి జొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి.
– కండయాల లక్ష్మణ్, వడ్లం గ్రామ రైతు